Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఎమ్మెల్యే కె. సంజయ్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని, ఆయన బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నారని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు చెప్పారు. సంజయ్‌కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారని దాఖలైన అనర్హత పిటిషన్‌ను స్పీకర్ తోసిపుచ్చారు. దీంతో ఆయనకు ఊరట లభించింది. పార్టీ ఫిరాయించరనడానికి పిటిషనర్ సాక్షాధారాలు ఏవీ చూపించకపోవడంతతో ఆయన బిఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నారని స్పీకర్ తన తీర్పులో స్పష్టం చేశారు. జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పార్టీ ఫిరాయించారని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను స్పీకర్ కొట్టి వేశారు. 2023లో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ నుంచి ఎన్నికైన పది మంది ఎమ్మెల్యేలు వేర్వేరు సందర్భాల్లో కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని బిఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ జరిపి ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు టి. ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కాలె యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారలేదని, వారు బిఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నారని తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్‌నూ స్పీకర్  కొట్టివేయడంతో మొత్తం ఎనిమిది మందికి క్లీన్ చీట్ లభించింది.

ఇదిలాఉండగా ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్ తీర్పుపై స్పందిస్తూ తాను పార్టీ మారలేదని, బిఆర్‌ఎస్‌లోనే ఉన్నానని అన్నారు. బిఆర్‌ఎస్ శాసనసభాపక్షం కార్యాలయం నిర్వహణకు ప్రతి నెలా తన జీతం నుంచి ఐదు వేల రూపాయలు చెల్లిస్తున్నానని చెబుతూ ఇంతకంటే పెద్ద సాక్షం ఏమి కావాలన్నారు. తాను బిఆర్‌ఎస్‌లో ఉన్నానంటూ పలు సాక్షాలతో ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్ వద్ద అఫిడవిట్ దాఖలు చేశారు. స్పీకర్ తీర్పుపై బిఆర్‌ఎస్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరితే స్పీకర్ పార్టీ లేదని తీర్పు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. దీనిపై తాము న్యాయ నిపుణులతో చర్చించి కోర్టులో సవాల్ చేస్తామన్నారు.

కడియం, దానంపై కేసుల విచారణ

ఇదిలాఉండగా ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్‌పై స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణకు చేపట్టారు. పిటిషనర్, కుద్బుల్లాపూర్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కెపి వివేకానందను రెస్పాండెంట్ తరపు న్యాయవాది పలు ప్రశ్నలు వేశారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసునూ స్పీకర్ 19వ తేదీకి వాయిదా వేశారు. తాము పార్టీ మారలేదని, బిఆర్‌ఎస్‌లోనే ఉన్నామని ఎమ్మెల్యేలు కడియం, దానం ఇదివరకే అఫిడవిట్ దాఖలు చేశారు.