Reading Time: 2 minutes

మన తెలంగాణ / హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా విద్యుత్ వినయోగదారులకు కేంద్ర విద్యుత్ శాఖ తీపికబురు చెప్పింది. విద్యుత్ కనెక్షన్ కొరకు ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా తాజాగా విద్యుత్ సవరణ నిబంధనలు- 2024 ప్రకారం విద్యుత్ కనెక్షన్ల జారీ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. కనెక్షన్లలో పారదర్శకతను పెంచుతూ ఎక్కడా ఆలస్యం కాకుండా రూపొందించిన కొత్త నిబంధనలు గురువారం నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఇక నుంచి మెట్రో నగరాల్లో వినియోగదారుడు దరఖాస్తు చేసుకున్న 3 రోజుల్లోనే కనెక్షన్ ఇవ్వాలనే నిబంధన పెట్టారు. అలాగే మున్సిపాలిటీల్లో గరిష్టంగా 7 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో దరఖాస్తు చేసిన తర్వాత గరిష్టంగా 15 రోజుల్లో కొత్త కనెక్షన్ ఇవ్వాల్సిందే. కొండ ప్రాంతాలు లేదా భౌగోళిక ఇబ్బందులు ఉన్నచోట మాత్రం 30 రోజుల గడువు పెట్టారు. స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు వంటివి ఏర్పాటు చేయాల్సి వస్తే కేంద్ర విద్యుత్ శాఖ నిబంధనల మేరకు గరిష్టంగా 90 రోజుల్లోగా ప్రక్రియ పూర్తి చేయాలి.

మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం : విద్యుత్ కొత్త కనెక్షన్ల జారీలో మార్పులు చోటుచేసుకున్న తరుణంలో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఇందుకోసం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. స్తంభాలు, లైన్స్ కోసం వినియోగదారుల నుంచి దూరాన్ని బట్టి ఒక్కో రీతిలో డబ్బు వసూలు చేసేవారు. కానీ, ఇక నుంచి ఫిక్స్‌డ్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. 1 కిలో వాట్ కనెక్షన్‌కు రూ.500 కడితే సరిపోతుంది. 1 కిలోవాట్ నుంచి 5 కిలో వాట్ల వరకు రూ.3,500 వరకు ఛార్జ్ చేస్తారు.

పూర్తిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు : కొత్త కనెక్షన్ కావాలనుకునే వారు ఇకపై భౌతిక పత్రాలతో అధికారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. సంబంధిత డిస్కంల అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్, ఆస్థి పత్రాలు వంటి అవసరమైన సర్టిఫికెట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. అలాగే వినియోగదారుడి దరఖాస్తు ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ట్రాక్ చేయవచ్చు. అధికారుల నిర్లక్ష్యం వల్ల జాప్యం జరిగితే ఆటోమేటిక్‌గా ఉన్నతాధికారులకు సమాచారం ఎస్కలేట్ అవుతుంది.

అపార్ట్‌మెంట్లకు వెసులుబాటు : హై రైజ్ అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో నివసించే వారు తమకు నచ్చిన విధంగా వ్యక్తిగత కనెక్షన్లు పూర్తి సొసైటీకి కలిపి సింగిల్-పాయింట్ కనెక్షన్‌ను ఎంచుకోవచ్చు. దీనిపై సొసైటీ సభ్యులు ఓటింగ్ ద్వారా నిర్ణయం తీసుకునేలా అవకాశం కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చే ప్రతి కొత్త కనెక్షన్‌కు స్మార్ట్ మీటర్లను తప్పనిసరి చేశారు. దీంతో రీడింగ్ తీసుకోవడంలో అక్రమాలకు తావుండదు. 10 కిలోవాట్ల వరకు రూఫ్-టాప్ సోలార్ ప్యానెల్స్ పెట్టుకునే వారికి టెక్నికల్ ఫీజిబిలిటీ స్టడీ ఇక నుంచి అవసరం లేకుండా చేశారు. ఈ నిబంధనతో సోలార్ విద్యుత్ వాడేవారికి ప్రోత్సాహకరంగా ఉండనుంది. విద్యుత్ శాఖ ప్రవేశపెట్టిన తాజా సంస్కరణల ద్వారా డిస్కంల పనితీరులో పారదర్శకత పెరుగుతుందని, వినియోగదారులకు మెరుగైన సేవలు అందుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.