
న్యూఢిల్లీ: కేంద్రం బడ్జెట్ సమగ్రంగా లేదని విపక్షనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సవాల్ విసిరారు. లోపాలు ఉన్నాయన్న ఆరోపణలను కాంగ్రెస్ తనముందు నిలబడి చెప్పగలదా ? అని సవాల్ విసిరారు. యువత నైపుణ్యం, వ్యవస్థాపకత, కృత్రిమ మేధస్సు వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై బడ్జెట్‌లో తమ ప్రభుత్వం ముఖ్యంగా దృష్టి కేంద్రీకరించిందని సీతారామన్ చెప్పారు.
దేశంలో అభివృద్ధి చెందుతున్న కార్మిక మార్కెట్ అవసరాలను తీర్చడానికి, వ్యవసాయం , గ్రామీణ ఉపాధి, యువతకు ఉపాధి శిక్షణ కేంద్రాలు వంటి వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాహుల్ గాంధీ ఇటీవల కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తీరుపై విమర్శలు చేశారు. దేశంలో నెలకొన్న వాస్తవ సంక్షోభాలపై దృష్టి పెట్టలేదని, యువతకు ఉద్యోగాలు లేవని, తయారీ రంగం పతనమవుతోందని ఆరోపించారు. పెట్టుబడిదారులు పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారని చెప్పారు. రైతుల ఇబ్బందులతోపాటు ప్రపంచ దేశాల నుంచి ఎదురవుతున్న అనేక చిక్కులు వంటి అంశాలను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.