
ముంబై : ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వే పై రాయ్‌ఘడ్ జిల్లా లోని ఖండాలా ఘాట్ అదోషిటన్నెల్ వద్ద మంగళవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడడంతో 18 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు 12 కిమీ మేర వాహనాలు ఆగిపోయాయి. ట్యాంకర్ లోని ప్రమాదకరమైన ప్రొపైలెన్‌గ్యాస్ లీక్ అవుతుండడంతో ఆ రోడ్డుకు కొంత దూరంలో వాహనాలను నిలిపివేశారు. దీంతో వందలాది మంది ప్రయాణికులు 18 గంటలకు పైగా ట్రాఫిక్‌లో చిక్కుకు పోయారు.
సాయంత్రం ట్యాంకర్ బోల్తా పడగా, అర్ధరాత్రికి సంఘటన స్థలానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం చేరుకుందని ప్రయాణికులు ఆరోపించారు. ఆహారం, వాష్‌రూమ్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ప్రయాణికులు ఆరోపించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ ట్యాంకర్ నుంచి 50 శాతం గ్యాస్ మాత్రమే విడుదలయ్యిందని, మిగిలిన గ్యాస్‌ను తొలగించడానికి నిపుణులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రద్దీ పెరగడంతో వాహనాలను పాత ముంబై పుణె హైవే వైపు మళ్లించినట్టు తెలిపారు.