
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. స్టార్ హీరోగా ఎదిగారు మాస్ మహరాజ రవితేజ. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానుల్లో సందడి నెలకొంటుంది. అయితే ఇప్పుడు రవితేజకు సినీ వారసుడు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. అతడే రవితేజ సోదరుడి కుమారుడు మాధవ్ భూపతిరాజు. మాధవ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మారెమ్మ’. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీపా బాలు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
పూర్తి గ్రామీణ వాతావరణంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఓ గ్రామానికి శాపం పడితే.. దాన్ని నుంచి తప్పించుకోవడానికి మారెమ్మ అనే దేవతకు పూజలు చేయడం ఈ టీజర్‌లో చూపించారు. తొలి సినిమా అయినప్పటికీ.. మాధవ్ తన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడనే చెప్పుకోవాలి. ఇక ఈ సినిమాకు మంచాల నాగరాజు దర్శకత్వం వహించగా.. మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మించారు. సినిమాలో వినోద్ కుమార్, వీఎస్ రూపా లక్ష్మి, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్.విహారి సంగీతమందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.