
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ముగ్గురు అక్కచెల్లెళ్లు తొమ్మిదో అంతస్తునుంచి దుమికి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనం కల్గించింది. వీరు 12,14,16 ఏళ్ల చిన్నారులు. సారీ.. నాన్నా.. నేను ఒంటరి తనంతో బాధపడుతున్నా.. అని లేఖ రాసి వారు బుధవారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. టీనేజ్ పిల్లలు మరణించడంతో తల్లిదండ్రులు బాధతో కుమిలిపోతున్నారు.వీరి ఆత్మహత్యలకు కారణం..మొదట్లో కొరియన్ టాస్క్ -ఆధారిత గేమింగ్ యాప్ అని భావించినా, పోలీసులు మాత్రం గేమింగ్ కోణాన్ని తోసిపుచ్చారు. మరణించిన ఆ అమ్మాయిలు తమ డైరీలో పేర్కొన్నట్లు కొరియన్ సంసృ్కతి,వినోదం ద్వారా ప్రభావితమయ్యారని పోలీసులు తెలిపారు.వారు తమ డైరీలో పేర్కొన్న ప్రకారం, ఆ అమ్మాయిలు కొరియన్ సంసృ్కతిని ఇష్టపడుతున్నారని, కె-పాప్ సంసృ్కతి, కొరియన్ సినిమాలు
, కొరియన్ సంగీతం, షాట్ ఫిల్మ్ లు, కొరియన్ షోలు, కొరియన్ సినిమాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారని పోలీసు డిప్యూటీ కమిషనర్ నిమిష్ పాటిల్ తెలిపారు.కొరియన్ సినిమాలు, చూడడం, మ్యూజిక్ వినడం వారికి వ్యసనంగా మారిందని, చదువుకుంటున్న పిల్లలు… అలాంటి కంటెంట్ చూడడం గమనించిన తల్లిదండ్రులు వారిని మందలించి, వారి ఫోన్ లను గుంజుకున్నారని, దీంతో మనస్థాపం చెందిన పిల్లలు ఈ ఆత్మహత్యకు సాహసించారని అధికారులు తెలిపారు.వారి గదిలో దొరికిన సూసైడ్ నోట్ లో .. ఏడుస్తున్న బొమ్మ వేసి.. సారీ..నాన్నా అంటూ, డైరీలో పూర్తిగా చదవండి. దానిలో ఉన్నది అంతా నిజమే. అని పిల్లలు రాశారు.బాలికల తండ్రి చేతన్ కుమార్ కు ఇద్దరు భార్యలు, మొత్తం ఐదుగురు పిల్లలు. వీరంతా కలిసే ఉంటున్నారు. చనిపోయిన బాలికలలో ఒకరు మొదటి భార్య కుమార్తె కాగా, మిగత ఇద్దరూ రెండో భార్య పిల్లలు.. చేతన్ భార్యలు ఇద్దరూ అక్క చెల్లెళ్లే. మొదటి భార్యకు మొదట్లో సంతానం లేకపోవడంతో చేతన్ తన భార్య చెల్లెలినే రెండో బార్యగా వివాహం చేసుకున్నాడు.