
కూటమి ప్రభుత్వంపై మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు నేపథ్యంలో బుధవారం ఎపికి వచ్చిన జగన్ సిఎం చంద్రబాబుపై ఫైరయ్యారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని మండిపడ్డారు. సిఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్యం నడుస్తోందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసిపి నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజని మీద దాడులు చేశారని.. వాళ్లు చేసిన తప్పేంటని ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. ఏడాదిన్నరగా కావాలనే సిఎం చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేపట్టారని విమర్శించారు.
తిరుమల లడ్డులో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని రకరకాలుగా తప్పుడు ప్రచారం చేశారని. పవన్ కళ్యాణ్ కూడా అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. దేవుడంటే ఏమాత్రం భయం, భక్తి లేకుండా వీళ్లు రాజకీయాలు చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, సిఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు అయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.