
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో మంగళవారం నాడు లోక్ సభలో మరోసారి గం దరగోళ పరిస్థితి నెలకొంది. లోక్ సభలో ప్రతిపక్షనాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా అధికార పక్షం సభ్యులు అభ్యంతరాలు, ప్రతిపక్షసభ్యులు వాగ్వాదానికి దిగడంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఏడుగురు కాంగ్రెస్ స భ్యులు, సిపిఎం ఎంపిని మంగళవారం లోక్ సభ నుంచి సస్పెండ్ చేశారు. సభా నిబంధనలకు వి రుద్ధంగా ప్రవస్తిస్తున్నారని పేర్కొంటూ వారిని స స్పెండ్ చేశారు. దీంతో వారు పత్రాలను చింపి స్పీకర్ వేదిక పైకి విసిరారు.బడ్జెట్ సమావేశాలు ఈ సెషన్ ఏప్రిల్ 2న ముగియనుంది. అప్పటివర కూ వారిని సభనుంచి సస్పెండ్ చేయడంతో , అ ధికార ప్రతిపక్షాల మధ్య వివాదం మరింత ముదురే అవకాశం ఉంది. 2020లో భారత్ – చైనా సైనికుల మధ్య ఘర్షణ, వివాదంపై మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎంనరవాణే రాసిన ఇంకా ప్రచురితంకాని జ్ఞాపకాల నుంచి కొన్ని అంశాలను సభలో ప్రస్తావించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నించినప్పుడు అందుకు స్పీకర్ అనుమతి నిరాకరించడంతో గొడవ మొదలైంది. అలాగే అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ భారత – అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించడం, వారణాశి లోని మణికర్ణికా ఘాట్ లో చేపట్టిన కూల్చివేతలపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
మంగళవారం ఉదయం నుంచి సభ పలు సార్లు వాయిదా పడిన తర్వాత, మధ్యాహ్నం 3 గంటలకు సమావేశమైనప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్న దిలీప్ సైకియా 8 మంది సభ్యుల పేర్లను ప్రస్తావించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు 8 మంది సభ్యును బడ్జెట్ సెషన్ లోని మిగతా కాలానికి సస్పెండ్ చేయాలని కోరుతూ ఓ తీర్మానాన్ని చదివి విన్పింంచారు.సస్పెండ్ అయిన కాంగ్రెస్ సభ్యులు గుర్జీత్ సింగ్ అజ్లా, హిబి ఊడెన్, సి. కిరణ్ కుమార్ రెడ్డి, అమరీందర్ సింగ్ రాజా వారింగ్, మాణిక్కం ఠాగూర్, ప్రశాంత్ పడోల్, డీన్ కురియాకోస్,సిపిఐ (ఎం) సభ్యుడు ఎస్ వెంకటేశన్. ఈ సభ్యులు స్పీకర్ చైర్ గౌరవాన్ని కూడా విస్మరించారని, వారు స్పీకర్ చైర్ పై చించిన కాగితాలను విసిరి వేశారని, వారి ప్రవర్తనకు చైర్ వారి పేర్లను ప్రస్తావించిందని రిజిజు పేర్కొన్నారు. మూజువాణి ఓటుతో వారి సస్పెన్షన్ తీర్మానాన్ని సభ ఆమోదించింది.
మాజీ ఆర్మీ చీఫ్ జ్ఞాపకాల ప్రస్తావన
మంగళవారం ఉదయం రాహుల్ గాంధీ మాజీ ఆర్మీ చీఫ్ నవరణ రాసిన జ్ఞాపకాల వ్యాసం కాపీని సభకు సమర్పించారు. రాహుల్ ను అడ్డుకునేందుకు అధికారపక్షం, వారిని నివారించేందుకు ప్రతిపక్ష సభ్యులు పరస్పర నినాదాలతో సభను హోరెత్తించడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. హరీష్ బాలయోగి ప్రసంగిస్తుండగా, ప్రతి పక్ష ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో గందరగోళం నెలకొనడంతో సభను మధ్యాహ్నం 3 గంటలవరకూ వాయిదా వేశారు.
రాజ్యసభలో
భారత్‌అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చకు విపక్షాలు మంగళవారం రాజ్యసభలో డిమాండ్ చేశాయి. తరువాత వాకౌట్ చేశాయి.జీరో అవర్ పూర్తి కాగానే కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఈ వాణిజ్య ఒప్పందం అంశాన్ని తీసుకు వచ్చారు. ప్రభుత్వం నుంచి రావలసిన ఈ సమాచారం వాషింగ్టన్ నుంచి రావడాన్ని ఆయన ఆక్షేపించారు. సభలో విపక్షాలు అసమ్మతి తెలియజేయగానే సభా నాయకుడు జెపి నడ్డా భారత ఎగుమతులపై సుంకాలు తగ్గిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలియజేశారని, తరువాత ప్రధాని నరేంద్రతో కూడా ఆయన మాట్లాడారని వివరించారు. మంచి విషయాల్లో కూడా చెడుగా చూడడం ప్రారంభం కావడంతో విపక్షం అసమ్మతి బయటపడిందని నడ్డా వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంపై పూర్తి వివరాలతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని,సుమోటో ప్రకటనతో ప్రభుత్వం ముందుకు వస్తుందని సభకు హామీ ఇచ్చారు. కానీ ఇలా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని, ఇది భారత కాంగ్రెస్, ఇండియా కూటమి బాధ్యతారాహిత్యమని నడ్డా విమర్శించారు. దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపిస్తూ విపక్షం నినాదాలు కొనసాగిస్తుండడంపై చైర్మన్ సిపి రాధాక్రిష్ణన్ జోక్యం చేసుకుని ప్రభుత్వం ప్రకటన చేస్తామని చెప్పినప్పుడు వినాలని సూచించారు.
అయినా సరే విపక్షాలు వెనక్కు తగ్గకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు చొచ్చుకుని వెళ్లారు. నడ్డా మాట్లాడుతూ ప్రభుత్వం ఈరోజే దీనిపై సుమోటో స్టేట్‌మెంట్ ఇస్తుందని దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతీదీ రాజకీయం చేయడం వారికి ఆసక్తి అని, దానికి ఉదాహరణ ఇప్పుడు జరుగుతున్నదేనని నడ్డా విపక్షాలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చర్చకు దూరంగా ఉంటుందని దేశంలో వాతావరణం సృష్టించడానికి వారు ప్రయత్నిస్తున్నారని నడ్డా వ్యాఖ్యానించారు. “చర్చించడానికి ఎలాంటి అంశాలు లేని పార్టీ మీది. ఇది బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన. ఒకవిధంగా దేశ వ్యతిరేక ప్రవర్తన ” అని నడ్డా విపక్షంపై ధ్వజమెత్తారు. టిఎంసి తప్ప మిగతా విపక్షాలన్నీ నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశాయి. టిఎంసి సభ్యుడు సాకేత్ గోఖలే కూడా సభలో కొంతసేపు కూర్చుని వాకౌట్ తరువాత బయటకు వెళ్లారు. “ సర్” బాధిత కుటుంబాలపై ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా తాము వేరేగా వాకౌట్ చేశామని టిఎంసి వెల్లడించింది.