Reading Time: 4 minutes

వారం రోజుల పాటు ‘సంస్కరణల ఎక్స్‌ప్రెస్’ వస్తుంది అంటూ ‘వికసిత్ భారత్’ దిశలో దేశాన్ని నడిపించే అనూహ్యమైన వార్షిక బడ్జెట్ రాబోతుంది అంటూ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. అయితే ఆదివారం నాడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను చూస్తే నిరాశే కలిగింది. దేశంలో అత్యధిక ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలను పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.ప్రధానంగా నిరుద్యోగం, అధిక ధరలు, పెరుగుతున్న ఆర్థిక వ్యత్యాసాలు, సంక్షోభకర వ్యవసాయరంగం కీలక సమస్యలుగా ఉన్నాయి. 25 కోట్ల మందిని పేదరికం దిగువ రేఖ నుండి పైకి తీసుకొచ్చామని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్నప్పటికీ ఇంకా 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ ఇస్తున్నామని చెబుతున్న ప్రకటనలే దేశంలో దారుణమైన పేదరికాన్ని వెల్లడి చేస్తున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి పెరగడం లేదు. దానితో డిమాండ్ పెరగకపోవడంతో దేశంలో ఉత్పత్తి రంగం పుంజుకోవడం లేదు. స్వాతంత్య్రం తర్వాత మొదటిసారిగా ఉత్పత్తి రంగంలో ప్రతికూలత చూసాము.

విద్య, వైద్య రంగాల నుండి ప్రభుత్వం దాదాపుగా నిష్క్రమిస్తూ ఉండడంతో వాటికి కేటాయింపులు కూడా తగ్గిపోతున్నాయి. దేశంలో అతిపెద్ద కార్పొరేట్ కంపెనీలలో విద్యావంతులైన యువతకు ఇంటర్న్‌షిప్ సదుపాయం కల్పిస్తామని గత ఏడాది బడ్జెట్‌లో ఆర్ధిక మంత్రి ప్రకటించారు. అయితే సుమారు 1.65 లక్షల మంది అందుకోసం దరఖాస్తు చేసుకుంటే 35,000 మందికి మించి ఆ సదుపాయం దక్కలేదు. అంత ప్రతికూలంగా నిబంధనలు రూపొందించారు. ప్రభుత్వం ఉద్యోగాల గురించి ప్రకటనే గాని ఉన్న ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయో తెలియక యువత ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం ప్రకటిస్తున్న నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు అన్ని అవినీతి కేంద్రాలుగా మారిపోయి, ఆచరణలో యువతకు ఉపయోగపడటం లేదు. దేశంలో 500కు పైగా ఉన్న ప్రైవేట్, డీమ్డ్ యూనివర్శిటీలలో ప్రవేశం సంపన్నులకు పరిమితమై పోతున్నది. వాటిల్లో రిజర్వేషన్లు అమలు కావడం లేదు. ఆ విధంగా విద్యారంగంలో దారుణమైన వివక్షను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

ప్రస్తుత ఏడాది జిడిపి తొలి ముందస్తు అంచనాలు వ్యవసాయ రంగంలో నెలకొన్న దుస్థితిని వెల్లడిస్తున్నాయి. మొత్తం జిడిపి వృద్ధి 7.4 శాతంగా అంచనా వేయగా, వ్యవసాయ రంగ వృద్ధి 4.6 శాతం నుండి 3.1 శాతానికి మందగించే అవకాశం కనిపిస్తోంది. మొత్తం శ్రామికశక్తిలో 45 శాతం మందికి ఉపాధి కల్పిస్తూ, మొత్తం జిడిపికి సుమారు 17 శాతం వాటాను అందిస్తున్న ఈ రంగానికి కేంద్ర బడ్జెట్ ఒక ప్రోత్సాహాన్ని అందిస్తుందనే అంచనాలు వమ్ము అయ్యాయి. అభివృద్ధి వ్యయాల కంటే సబ్సిడీలే ఆధిపత్యం వహించే యథాతథ పద్ధతి కొనసాగుతోంది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 1.63 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకి కేటాయించిన రూ. 1.4 లక్షల కోట్లు సవరించిన అంచనా కన్నా 5.4 శాతం మాత్రమే పెరుగుదల. మరోవంక, వ్యవసాయ పరిశోధన, విద్య విభాగానికి కేటాయింపులు 3 శాతం తగ్గాయి.

మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖకు కేటాయింపులు 26.7 శాతం పెరగడం హర్షణీయమే అయినప్పటికీ, గ్రామీణ -వ్యవసాయ రంగానికి అందించే మొత్తం మద్దతులో అధిక భాగం, అంటే రూ. 6.7 లక్షల కోట్లు (మొత్తం రూ. 53.5 లక్షల కోట్ల బడ్జెట్‌లో 12.6 శాతం), సంక్షేమ చర్యలు, సబ్సిడీల కోసమే అని గమనించాలి. ఆహార, ఎరువుల సబ్సిడీల కోసం కేటాయింపులు మొత్తం బడ్జెట్ వ్యయంలో దాదాపు 7.45 శాతంగా ఉండగా, ఆహార సబ్సిడీ ఒక్కటే రూ. 2.27 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇది గత సంవత్సరం సవరించిన అంచనాతో దాదాపు సమానం. ఎరువుల సబ్సిడీని రూ. 1.7 లక్షల కోట్లుగా నిర్ణయించారు. ఇది రూ. 1.86 లక్షల కోట్ల నుండి తగ్గింది. వికసిత్ భారత్ -గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) (విబి- జి రామ్ జి) కి రూ. 95,692 కోట్లు కేటాయించారు.

సబ్సిడీలపై కాదు.. పరిశోధనలపై ఖర్చు పెట్టాలి

బలమైన, మరింత ఉత్పాదక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ లేకుండా వికసిత్ భారత్ కలను సాకారం చేసుకోలేము. గ్రామీణ జీవనోపాధిని మెరుగుపరచడానికి అభివృద్ధి వ్యయాలే ఏకైక మార్గం. అయితే, వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ బడ్జెట్‌తో పోలిస్తే సంక్షేమ చర్యలు, సబ్సిడీల వాటా ఎక్కువగా ఉండటం ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ల లేదని గుర్తించాలి. వ్యవసాయ పరిశోధన, అభివృద్ధిలో పెట్టుబడులు పెంచకుండా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కాలేదు. ఇంత పెద్ద బడ్జెట్ లో అందుకోసం సుమారు రూ. 10,000 కోట్లు మాత్రమే కేటాయించారు. భారతదేశం తన వ్యవసాయ జిడిపిలో 0.5 శాతం కంటే తక్కువ ఖర్చు చేస్తుంది. ఇది స్థిరమైన ఉత్పాదకత వృద్ధికి సంబంధించిన 1 శాతం బెంచ్ మార్క్ కంటే చాలా తక్కువ. ఎరువుల సబ్సిడీలపై ఖర్చు చేసే ప్రతి మిలియన్ రూపాయలకు, కేవలం 26 మంది మాత్రమే పేదరికం నుండి బయటపడతారని ఐసిఆర్‌ఐఇఆర్ పరిశోధన వెల్లడిస్తోంది.

అదే మొత్తం వ్యవసాయ పరిశోధన, విస్తరణపై ఖర్చు చేస్తే మొత్తం 328 మందిని పేదరికం నుండి బయటపడేయగలదు. ఎరువుల సబ్సిడీలపై ఖర్చు చేసే ప్రతి రూపాయి వ్యవసాయ జిడిపిలో కేవలం రూ. 0.88 రాబడిని ఇస్తుంది. అయితే వ్యవసాయ పరిశోధనల నుండి వచ్చే రాబడి రూ. 11.2. అయినప్పటికీ, ప్రభుత్వ ప్రాధాన్యతలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. సబ్సిడీలు ప్రయోజనకరంగా కనిపిస్తాయి. ఓట్లను రాబడతాయి. అయితే పరిశోధన, మౌలిక సదుపాయాలపై రాబడికి సమయం పడుతుంది. కానీ వాతావరణ మార్పు, భూగర్భజల ఒత్తిడి, క్షీణిస్తున్న నేల నాణ్యత, జీవవైవిధ్య నష్టం ఈ నమూనాను నిలకడలేనివిగా చేస్తాయి. బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చూపుతున్నప్పటికీ ఆ మొత్తాలను ఖర్చు చేయడం లేదు. చేసిన ఖర్చులు సైతం ఎక్కువగా జీతభత్యాలు, పెన్షన్లు, నిర్వహణ, ప్రచారంలకు పరిమితం అవుతున్నాయి.

‘వికసిత్ భారత్’, ‘అమృత్ కాల్’ వంటి నినాదాలు వినిపిస్తున్నాయి గానీ.. ఆ నినాదాల వెనుక ప్రజల జీవితాల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. ప్రతీ బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు భారీ కేటాయింపులు ప్రకటిస్తున్న కేంద్రం ఏడాది ముగిసేసరికి అవే పథకాల్లో ఖర్చులు తగ్గిస్తోంది. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పోషణ వంటి రంగాలకు బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులు కాగితాలపై మాత్రమే పెరుగుతున్నాయి. 2025- 26 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణాభివృద్ధి కేటాయింపులు రూ. 2.65 లక్షల కోట్ల నుంచి రూ. 2.12 లక్షల కోట్లకు పడిపోయాయి. వాస్తవంగా ప్రజలకు చేరాల్సిన నిధులు మాత్రం తగ్గిపోతున్నాయి. ఇది సంక్షేమానికి నిబద్ధత కాదనీ, రాజకీయ ప్రదర్శన మాత్రమేనని విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాకరంగా ప్రారంభించిన అనేక పథకాలు కాలక్రమంలో కలిసిపోతున్నాయి.

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని స్వయంగా ప్రధాన మంత్రి మోడీ 1917లో ప్రకటించారు. ఇప్పుడా విషయమే ప్రస్తావించడం లేదు. వ్యవసాయ సంస్కరణలను గాలికి వదిలివేశారు. మరోవంక, మౌలిక సదుపాయాల పేరిట ప్రభుత్వ పెట్టుబడులు లేకుండా కాంట్రాక్టర్లకు బ్యాంకు రుణాలతో నిర్మించే రహదారులపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఒక వంక టోల్ ఫీజ్ పేరుతో ప్రజల నుండి ప్రతి ఏడాది లక్ష కోట్ల రూపాయలకు పైగా దోపిడీ చేస్తూ, మరోవంక అవసరం లేకపోయినా ఎక్స్‌ప్రెస్ రహదారుల పేరుతో విలువైన వ్యవసాయ భూము లు, అటవీ భూములను ఆక్రమిస్తున్నారు. దానితో ఒక వంక ఆహార సంక్షోభం, మరోవంక వాతావరణ కాలుష్యం వ్యాప్తి చెందే ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇటువంటి రహదారుల నిర్మాణాల అవసరం గురించి శాస్త్రీయ అధ్యయనాలు ఏమైనా జరిపించారా?

ఇక భారత్ నాలుగో పెద్ద ఆర్థిక వ్యవస్థ అని, త్వరలో మూడో స్థానానికి చేరుకోబోతున్నామని చెబుతున్నారు. అయితే ఆర్థిక తరతమ్యాలు పెరిగిపోతూ ఉండడం, బిలియనీర్లు దేశంలో వ్యాపారాలు చేయలేక విదేశాలకు వలస వెళ్లిపోవడం, దేశంలో విదేశీ పెట్టుబడులు గాని, ప్రైవేట్ పెట్టుబడులు గాని ఆశించిన స్థాయిలో రాకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. మరోవంక ప్రభుత్వం అప్పులపైననే నడుస్తున్నది. 1947 నుండి 2014 వరకు ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది, అంతకు నాలుగు రెట్లుగా గత 12 ఏళ్లలో చేస్తున్నది. ప్రస్తుతం వార్షిక బడ్జెట్‌ను రూ. 53.5 లక్షల కోట్లతో రూపొందించారు. అయితే, అందులో ప్రభుత్వ ఆదాయం పన్నుల రూపంలో రూ. 27 లక్షల కోట్లకు మించి రాదనీ స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ ఖర్చులకు అడ్డుగా నిలుస్తున్న ప్రధాన అంశం అప్పులపై వడ్డీ చెల్లింపుల భారం. 2025లో రూ. 11.37 లక్షల కోట్లుగా ఉన్న వడ్డీ చెల్లింపులు, 2026లో రూ. 12.76 లక్షల కోట్లకు పెరిగాయి. దీనితో సంక్షేమానికి అదనపు నిధులు కేటాయించడం ఆర్థికంగా భారం అవుతుంది. మరోవంక, గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు అట్లా ఉంచితే, దీని ఉనికి నేడు ప్రశ్నార్థకంగా మారుతుంది.

ఓ కుటుంబానికి కనీస పని దినాలు 100 నుండి 125 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆ మేరకు నిధుల కేటాయింపు జరపలేదు. పైగా, సగటున ప్రస్తుతం 55 దినాలకు మించి పని కల్పించడం లేదు. అంటే, ఎక్కువ పనిదినాలు కల్పించడం ప్రచారం మాత్రమే అని స్పష్టం అవుతుంది. వందే భారత్ రైళ్లు, హైస్పీడ్ రైళ్లపై ఆసక్తి చూపుతున్న ప్రభుత్వం సాధారణ ప్రజలు ఎక్కువగా ప్రయాణించే రైళ్లపై చూపడం లేదు. ఇప్పుడు రిజర్వేషన్ లభించటమే అసాధ్యంగా మారిపోతుంది. కరోనా సమయంలో రద్దు చేసిన పలు సాధారణ రైళ్లు, తగ్గించిన బోగీలను ఇంకా పునరుద్ధరించ లేదు. వందే భారత్, హైస్పీడ్ రైళ్లు చార్జీలు దేశంలో అత్యధిక ప్రజలకు అందుబాటులో లేవు. రైల్వే ట్రాక్‌ల భద్రతను గాలికి వదిలివేస్తున్నారు.

చలసాని నరేంద్ర, 98495 69050