
తెలంగాణలోని ఒక మారుమూల గ్రామంలో ఉదయం తెల్లవారుజామునే ఒక యువకుడు టివి ముందు కూర్చుంటాడు. అతని చేతిలో ఖరీదైన పుస్తకాలు లేవు. ఖరీదైన కోచింగ్ సెంటర్లకూ వెళ్లలేడు. అయినా అతని కళ్లలో మాత్రం ఒక ప్రశ్న నాకు కూడా అవకాశం ఉంటుందా? అని. ఈ ప్రశ్నకు సమాధానంగా టి సాట్ మారింది. టి సాట్ ద్వారా నగరంలోని నిపుణులైన గురువుల పాఠాలు, గ్రామంలోని ఆ ఇంటికి చేరి తెలంగాణ యువత కలలకు ప్రాణం పోస్తోంది. ఇటీవల సచివాలయంలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు టి సాట్ సిఇఒ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డితో కలిసి ఎడ్‌సెట్ ప్రసారాల షెడ్యూల్ పోస్టర్‌ను ఆవిష్కరించడం, ప్రభుత్వ విద్యా సంకల్పానికి స్పష్టమైన సంకేతాన్ని తెలియజేస్తుంది. ఎడ్‌సెట్‌లో ఉన్నత ర్యాంకులు సాధించడానికి టి సాట్ అందించే డిజిటల్ కంటెంట్‌ను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి చేసిన సూచన, వేలాది బిఎడ్ విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇది కేవలం ఒక పరీక్షకు సంబంధించిన ప్రకటన కాదు. ఇది ప్రభుత్వ ఆలోచనా ధోరణిని ప్రతిబింబిస్తోంది.
పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే, లక్షలకు లక్షలు ఫీజులు కట్టి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లాల్సిన పని లేకుండా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు రోజుకు నాలుగు గంటల పాటు మొత్తం 392 ఎపిసోడ్‌లతో, 98 రోజుల పాటు బయాలజీ, ఫిజికల్ సైన్స్, గణితశాస్త్రం, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్, తెలుగు వంటి కీలక సబ్జెక్టులపై నిపుణులతో ప్రసారాలు చేయనుంది. ఇది ప్రభుత్వ వ్యవస్థ ద్వారా తెలంగాణ పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు అందుతున్న ఒక విస్తృత అకాడమిక్ మద్దతు అనే చెప్పాలి. టి సాట్ విద్య, నిపుణ ఛానళ్లతో పాటు యాప్, యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా ఈ కంటెంట్ అందుబాటులో ఉండటం వల్ల, గ్రామీణ విద్యార్థికీ, నగర విద్యార్థితో సమానంగా చదువుకునే అవకాశం లభిస్తోంది.
ఈ కార్యక్రమాల విలువను అర్థం చేసుకోవాలంటే, ఒకసారి గ్రామీణ విద్యార్థి జీవితాన్ని చూడాలి. దూరపు గ్రామంలో, సరైన అధ్యాపకులు లేక, ఆర్థిక పరిమితులతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు టి సాట్ ఒక గురువుగా మారింది. తరగతి గదిలో కూర్చోలేని విద్యార్థికి, టెలివిజన్ తెరపై కనిపించే ఉపాధ్యాయుడే ఆశగా మారారు. నాకు కోచింగ్ సాధ్యం కాదు అనే నిరాశను, నాకు కూడా ఉద్యోగం వస్తుంది అనే నమ్మకంగా మార్చే శక్తి ఈ టి సాట్ డిజిటల్ విద్యలో ఉంది.
టి సాట్ సేవలు ఎడ్‌సెట్‌కే పరిమితం కావడం లేదు. ఎప్‌సెట్, పిజి ఇసెట్, డిఎస్‌సి వంటి అనేక కీలక పరీక్షల కోసం కూడా ప్రత్యేక డిజిటల్ కంటెంట్‌ను ప్రభుత్వం అందిస్తోంది. ఉన్నత విద్య, ఉపాధ్యాయ నియామకాలు, సాంకేతిక విద్య… ప్రతి దశలో విద్యార్థులకు తోడుగా నిలవాలన్న సంకల్పం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకే వేదికపై విభిన్న పరీక్షలకు అవసరమైన నాణ్యమైన కంటెంట్‌ను అందించడం, విద్యలో సమగ్రతను తీసుకొచ్చే ప్రయత్నంగా చెప్పుకోవచ్చు.
టి సాట్ పాత్ర విద్యతో మాత్రమే ముగియదు. వ్యవసాయం, ఆరోగ్యం, మహిళా సాధికారత, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో కూడా ఈ వేదిక కీలకంగా మారింది. రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన, మహిళలకు ఉపాధి శిక్షణ, యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ ఒకే ప్రసార వేదిక ద్వారా ప్రజల వద్దకు చేరుతున్నాయి. ఇలా టి సాట్ ప్రజలకు కేవలం సమాచారాన్ని మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని కూడా పంచుతోంది.
డిజిటల్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా సాగుతున్న టి సాట్ కార్యక్రమాలు గ్రామీణ -నగర అసమానతలను తగ్గించే శక్తివంతమైన సాధనంగా మారుతున్నాయి. ఒకప్పుడు నగరాల్లోనే లభించిన విద్యా వనరులు, ఇప్పుడు గ్రామాల్లోని ఇళ్లలోకి చేరుతున్నాయి. ఇది విద్యా సమానత్వం దిశగా ఒక పెద్ద అడుగు. ఈ కృషికి నాయకత్వం వహిస్తున్న టి సాట్ సిఇఒ వేణుగోపాల్ రెడ్డిని మంత్రి అభినందించడం, ఒక వ్యక్తికి కాదు ఒక వ్యవస్థకు ఇచ్చిన గుర్తింపుగా భావించాలి.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటే, టి సాట్ ముందు మరిన్ని అవకాశాలు ఉన్నాయి. కృత్రిమ మేధ ఆధారిత విద్యా కంటెంట్, వర్చువల్ ల్యాబ్‌లు, ఇంటరాక్టివ్ అభ్యాస విధానాలు ప్రవేశపెడితే తెలంగాణ విద్యా రంగం జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందగలదు. ప్రభుత్వం చూపుతున్న ఆసక్తి, విధానపరమైన మద్దతు చూస్తే, ఈ దిశలో ముందడుగులు వేయడం ఖాయం అనిపిస్తోంది. అయితే అవకాశాలను మన యువత ఎంతవరకు వినియోగించుకుంటుంది? అనేది ఇప్పుడు ప్రశ్న. ప్రభుత్వం టి సాట్ అనే వేదికను సిద్ధం చేసింది. ఈ వేదిక ద్వారా నిపుణులు జ్ఞానాన్ని పంచుతున్నారు. టెక్నాలజీ అందుబాటులో ఉంది. కాబట్టి, యువత దీనిని సద్వినియోగం చేసుకుని పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర సాధనతో పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి. టి సాట్ తరగతులు ఒక మార్గాన్ని చూపుతాయి.
కానీ, ఆ మార్గంలో నడిచే బాధ్యత యువతదే. విద్య ఒక కాలానికి పరిమితమైన అవసరం కాదు. అది తరతరాల భవిష్యత్తును తీర్చిదిద్దే శాశ్వత శక్తి. పుస్తకాలు చేతిలో ఉండటం ఒక్కటే విద్య కాదని, సరైన మార్గనిర్దేశం, సమాన అవకాశాలు అందినప్పుడే జ్ఞానం సమాజాన్ని ముందుకు నడిపిస్తుందని తెలంగాణ ప్రభుత్వం తన విధానాలతో నిరూపిస్తోంది. ఈ దిశలో టి సాట్ నెట్‌వర్క్ ద్వారా చేపడుతున్న డిజిటల్ విద్యా కార్యక్రమాలు, రాష్ట్రంలో ఒక నిశ్శబ్దమైన విద్యా విప్లవానికి నాందిగా నిలుస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ డిజిటల్ విద్యా యాత్ర, విద్య రంగంపై పెట్టుబడి పెడితే, యువత భవిష్యత్తు వెలుగొందుతుంది. జ్ఞానం ప్రజల వద్దకు చేరినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యం. టి సాట్ రూపంలో సాగుతున్న ఈ జ్ఞానయాత్ర, యువత కలలను నిజం చేసే వరకు నిరంతరం కొనసాగాలి. ఇదే తెలంగాణ ప్రజల ఆకాంక్ష!.
జి. లక్ష్మీదేవి