
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మున్సిప ల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు గడువు మంగళవారం సాయంత్రం ముగిసింది. దీంతో రా ష్ట్రవ్యాప్తంగా బి.ఫామ్ దక్కని నేతలు కంటతడి, తిట్ల పురాణం, ఆత్మహత్యాయత్నం ఘటనలు చోటుచేసుకున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీల బి.ఫాంలు దక్కని అ భ్యర్థులు భగ్గుమన్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపితో పాటు ఇతర పార్టీల నుంచి టికెట్ దక్కుతుందని ఆశించి భంగపడిన వారు వివిధ రూపాల లో నిరసన వ్యక్తం చేశారు. బి.-ఫామ్‌లు దక్కని వా రంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. పలువురు అభ్యర్థులైతే ఏకంగా బూతుల తో పార్టీ పెద్దలపై రెచ్చిపోయారు. ప్రధాన పార్టీలన్నింటిలోనూ రెబల్ అభ్యర్థులు తీవ్రస్థాయిలో రెచ్చపోయారు. టికెట్ తమకే ఇ స్తామని చెప్పి చివరి వరకు ఆశ పెట్టి భంగపాటుకు గురి చేశారని పలువురు నేతలు కన్నీటి పర్యంతమయ్యా రు.
ఆయా మున్సిపాలిటీల్లో నేతలకు ఉన్న ప్రజాబలంతో పాటు ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని పార్టీలు బి.ఫామ్‌లు కేటాయించాయి. ఎన్నికల్లో ఖర్చుపెట్టే స్థోమత ఉన్నవారికే అవకాశం ఇవ్వగా కొన్నిచోట్ల పార్టీ మారి వచ్చిన వారికి అవకా శం కల్పించినట్లు తెలిసింది. దీంతో చాలా కాలంగా పార్టీలో కొనసాగుతున్న నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇన్నాళ్లు ఎన్ని అవమానాలు ఎదురైనా విడవకుండా మోసిన పార్టీ జెండా, పార్టీ సిద్ధాంతాలు వారి ఆక్రోశాన్ని ఆపలేకపోయాయి. కట్టలు తెంచిన ఆగ్రహంతో పార్టీ అగ్రనేతలపై విరుచుకుపడ్డారు.పలు చోట్ల మహిళా నేతలు కంటతడి పెట్టగా సంగారెడ్డి జిన్నారం మున్సిపాలిటీలో తనకు రావాల్సిన టికెట్ అమ్ముకున్నారని ఓ మహిళా నేత దుమ్మెత్తి పోశారు. జగిత్యాలలో తనకు వచ్చిన బి.ఫామ్ చింపేశారని మహిళా నేత నేత కంటతడి పెట్టారు. తనకు టికెట్ ఇవ్వలేదని సిట్టింగ్ కౌన్సిలర్ కంటతడి పెట్టగా,ఒరిజినల్ బిజెపి వారిని కాదని పార్టీ మారి వచ్చిన వారికి ఎలా టికెట్ ఇస్తారని మరో నేత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలో మాజీ ఎంఎల్‌ఎ సుంకే రవిశంకర్ ఇంటి ముందు బిఆర్‌ఎస్‌కు చెందిన అభ్యర్థులు కళ్ళేపెల్లి మహేష్ దంపతులు పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి యత్నించారు.
జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్
కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి జీవన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీ విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సీట్ల పంపకంలో.. తన గొంతు కోశారని, కాంగ్రెస్ అధిష్ఠానం తన వర్గానికి న్యాయం చేయలేదని అనుచరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులు ఉండగా.. 29 టికెట్లు బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎంఎల్‌ఎ సంజయ్ కుమార్ వర్గానికి, 21 టికెట్లు జీవన్ రెడ్డి వర్గానికి పార్టీ అధిష్ఠానం కేటాయించారు. ఈ అంశం జీవన్ రెడ్డి వర్గంలో మరింత అసంతృప్తిని పెంచినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో స్థానిక ఎంఎల్‌ఎ సంజయ్ కుమార్ వైపే అధిష్ఠానం మొగ్గు చూపడంతో జీవన్‌రెడ్డి నివాసం వద్ద మంగళవారం నాడు పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బిఆర్‌ఎస్ నుంచి వచ్చిన వారికే టికెట్లు కేటాయిస్తున్నారంటూ జీవన్ రెడ్డి వద్ద వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ తనను మోసం చేశారని, తన కార్యకర్తలను బలి చేశారని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల మున్సిపాలిటీలో బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సంజయ్ వర్గానికే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు కేటాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.దాంతో జీవన్ రెడ్డి వర్గం నాయకులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంఎల్‌ఎ సంజయ్‌పై జీవన్‌రెడ్డి వర్గం కాంగ్రెస్ నేతలు బూతులతో రెచ్చిపోయారు. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జారీ చేసిన బి.ఫామ్‌ల విషయం పార్టీలోకి రెండు గ్రూపుల మధ్య చిచ్చురేపింది. బిఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన స్థానిక ఎంఎల్‌ఎ బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి వర్గానికి 36 అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ బి.ఫామ్‌లు జారీ చేసింది. అలాగే అక్కడ మరో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన సరితా యాదవ్ వర్గీయులకు ఏడు బి.ఫామ్‌లు అందాయి. అయితే, ఆమెకు బి.ఫామ్‌లు ఇచ్చిన స్థానాలలో కూడా బండ్ల కృష్ణమోమన్ తన అభ్యర్థులకు బి.ఫామ్‌లు ఇచ్చి బరిలోకి దింపారు. దాంతో ఆమె కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర వ్యక్తం చేశారు.
మంత్రి పొన్నం బావమరిదికి హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్
జనగామ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలవాలనుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బావమరిది పెద్ది నవీన్ కుమార్ గౌడ్‌కు చుక్కెదురైంది. 6వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, మున్సిపల్ ఛైర్మన్ పీఠం దక్కించుకోవాలకున్న ఆయన పథకం తలకిందులైంది. సోమవారం విడుదలైన అభ్యర్థుల తుది జాబితాలో నవీన్ పేరు లేకపోవడంతో ఆయన అనుచరులు షాక్‌కు గురయ్యారు. నవీన్ స్థానికేతరుడు అంటూ స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్రంగా అభ్యంతరం చెప్పడంతో ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ సంతకాల సేకరణ చేపట్టి అధిష్ఠానానికి పంపారు. స్థానికుల ఒత్తిడికి తలొగ్గిన ఎంపిక కమిటీ చివరకు బుక్క బాల భరద్వాజ్‌ను 6వ వార్డు అభ్యర్థిగా ఖరారు చేసింది.
బి.ఫామ్ మార్చినందుకు కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం
అదిలాబాద్ మున్సిపాలిటీలో బి.ఫామ్ ఇచ్చి వాపస్ తీసుకున్నందుకు కాంగ్రస్ అభ్యర్థి తౌ సీఖ్ అహ్మద్ ఆత్మహత్యాయత్నం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా తన పేరును ప్రకటించి ఉపసంహరణ సమయంలో తన పేరును తొలగించి మరో వ్యక్తికి బి.ఫామ్‌ను ఇవ్వడంతో తీవ్ర మనస్థాపానికి గురైనట్లు ఆయన పేర్కొన్నారు.
బిఆర్‌ఎస్‌లో బి.ఫామ్ లొల్లి
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా అమనగల్లు మున్సిపాలిటీలో బిఆర్‌ఎస్ అభ్యర్థుల మధ్య బి.ఫామ్ లొల్లి తారాస్థాయికి చేరింది. ఈ ఎన్నికల్లో 15 వార్డులకు పోటీ చేస్తున్న బిఆర్‌ఎస్ అభ్యర్థుల బి.ఫామ్‌ల పంపిణీ కార్యక్రమం రసాభసాగా మారింది. మాజీ ఎంఎల్‌ఎ గుర్కా జైపాల్‌యాదవ్, పార్టీ నేతలు గోలి శ్రీనివాస్‌రెడ్డి, రజినిల సమక్షంలో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని 14వ వార్డు అభ్యర్థిగా వస్పుల సాయిలును ప్రకటించడంతో పార్టీ టికెట్‌ను ఆశించిన వస్పుల సుగుణ అనుచరులు మాజీ ఎంఎల్‌ఎతో వాగ్వివాదానికి దిగారు. టికెట్ ఇస్తామని హమీ ఇవ్వడంతో నెల రోజులుగా వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నామని, తమను కాదని మరొకరికి టికెట్ ఎలా ఇస్తారని నిలదీశారు. ఇరువురి మధ్య వాగ్వివాదం జరగడంతో ఆగ్రహించిన వారు కుర్చీలను విరగ్గొట్టారు. నిరసనల మధ్య పార్టీ మాజీ ఎంఎల్‌ఎ అభ్యర్థులకు ఫాంలను అందజేశారు.
కరీంనగర్‌లో గంగుల ఇంటి ముందు నిరసన
కరీంనగర్ మున్సిపాలిటీలో బిఆర్‌ఎస్ పార్టీ బి.ఫామ్ ఇవ్వలేదని మాజీమంత్రి, పార్టీ ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్ ఇంటి ముందు పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. బిఆర్‌ఎస్ జెండాలు, కండువాలను దగ్థం చేశారు. గంగుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశామని, తమకు టికెట్ ఇస్తామని నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
బిజెపి ఎంపి అరవింద్ నన్ను మోసం చేశారు : అభ్యర్థి ఆవేదన
ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బిజెపి కోసం పని చేస్తే టికెట్ ఇవ్వలేదని ఆ పార్టీ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల మున్సిపాలిటీలో బిజెపి ఎంపీ అరవింద్, నియోజకవర్గ ఇంచార్జ్ బోగ శ్రావణిపై రూ.5 లక్షలకు టికెట్లు అమ్ముకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 సంవత్సరాలు నుంచి తమ కుటుంబం బిజెపి పార్టీ కోసం పనిచేస్తున్నామని, పార్టీ కండువా కూడా కప్పుకోని వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారంటూ కంటతడిపెట్టారు.
అభ్యర్థులకు కలిసివచ్చేనా..?
పార్టీల బి.ఫామ్ దక్కని అభ్యర్థులు ఆవేదన ఒకలా ఉంటే, బి.ఫామ్‌లు సాధించుకున్న అభ్యర్థుల టెన్షన్ మరోలా ఉంది. పార్టీలో అవకాశం దక్కని నేతలు ఏ మేరకు తమకు సహకరిస్తారనే టెన్షన్ ఆయా పార్టీ అభ్యర్థులను వెంటాడుతోంది. ఎలాగైనా అసంతృప్తులు తమకు సహకరించేలా చేసుకునేందుకు వారిని బుజ్జగిస్తున్నారు. అయితే ఇన్ని వ్యయప్రసాలకు ఓర్చి బి.ఫామ్ సాధించుకున్న తమకు ప్రజలు ఓటేస్తారా..లేదా..? అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో పరిస్థితులకు అనుగుణంగా పెడుతూ గెలుపే లక్షంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు.