
తమ పార్టీపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి టి. హరీష్ రావు విషం చిమ్ముతున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా సిట్ అధికారులు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు నోటిసు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయించడం దేనికని ఆయన ప్రశ్నించారు. విచారణకు పిలిస్తేనే ఇంత రాద్ధాంతమా? అని ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. కెసిఆర్ జాతిపిత అంటూ కెటిఆర్, హరీష్ రావు పిట్టకథలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏదో రకంగా ప్రజలను మాయ చేసి గెలుపొందాలని ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు.
తన కుటుంబంలో అందరూ సెటిల్ అయ్యారని, కుమారుడు కెటిఆర్ అమెరికాలో ఉన్నాడని, అమ్మాయి పెళ్ళి చేసానని, ఎవరికీ పదవుల మీద ఆశ లేదని ఉద్యమం సమయంలో కెసిఆర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. కానీ అధికారంలోకి రాగానే ఇంట్లో అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ఎంపీ చామల విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచాచమని అన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడుతూ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని ఎంపీ చామల తెలిపారు.