
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గురుకులంలో ఇంటర్ విద్యార్థిని అశ్మిత పాముకాటుకు గురై మృత్యువుతో పోరాడుతున్న వార్త కలచివేస్తోందని -మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాలు విద్యా నిలయాలా.. లేక విషసర్పాలకు ఆవాసాలా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఇది మీ పరిపాలనా వైఫల్యం కాదా..? అని నిలదీశారు. 20 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటూ రంగుల లోకం చూపిస్తున్న సిఎం గురుకులాలను గాలికి వదిలేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. గురుకులాల్లో పిచ్చి మొక్కలు తొలగించే దిక్కు లేదు…చిమ్మచీకట్లో లైట్లు వేసే నాథుడు లేడు అని ఆందోళన వ్యక్తం చేశారు. అపరిశుభ్రత కారణంగా నేడు గురుకులాల్లో కుక్క కాట్లు, పాము కాట్లు సర్వసాధారణంగా మారిపోవడం అత్యంత దుర్మార్గం అని పేర్కొన్నారు.
గురుకుల బిడ్డలకు కడుపు నిండా తిండి లేదు.. ప్రాణాలకు రక్షణ లేదని వాపోయారు. ముఖ్యమంత్రి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లి విదేశాల్లో ఫోటోలకు పోజులిస్తే…ఇక్కడ పేద విద్యార్థులు ఆసుపత్రి పాలై కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు. తమ పిల్లలు గురుకులాలకు చదువుకోవడానికి వెళ్తున్నారా.. లేక చావుతో పోరాడటానికి వెళ్తున్నారా..? అని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి పతనమవుతున్న గురుకులాలను కాపాడాలి… విద్యార్థుల భవిష్యత్తును నిలబెట్టాలని కోరారు. అశ్మితకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. రాజకీయ కక్షసాధింపుల మీద ఉన్న శ్రద్ధలో కొంత అయినా పేద పిల్లల బతుకుపై పెట్టాలని సిఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. పాము కాటుకు గురై ఆసుపత్రిలో చేరిన గురుకుల బిడ్డ ప్రాణానికి రేవంత్ రెడ్డిదే పూర్తి బాధ్యత అని పేర్కొన్నారు.