Reading Time: < 1 minute

న్యూఢిల్లీ : భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చకు విపక్షాలు మంగళవారం రాజ్యసభలో డిమాండ్ చేశాయి. తరువాత వాకౌట్ చేశాయి. జీరో అవర్ పూర్తి కాగానే కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఈ వాణిజ్య ఒప్పందం అంశాన్ని తీసుకు వచ్చారు. ప్రభుత్వం నుంచి రావలసిన ఈ సమాచారం వాషింగ్టన్ నుంచి రావడాన్ని ఆయన ఆక్షేపించారు. సభలో విపక్షాలు అసమ్మతి తెలియజేయగానే సభా నాయకుడు జెపి నడ్డా భారత ఎగుమతులపై సుంకాలు తగ్గిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలియజేశారని, తరువాత ప్రధాని నరేంద్రతో కూడా ఆయన మాట్లాడారని వివరించారు. మంచి విషయాల్లో కూడా చెడుగా చూడడం ప్రారంభం కావడంతో విపక్షం అసమ్మతి బయటపడిందని నడ్డా వ్యాఖ్యానించారు.

ఈ ఒప్పందంపై పూర్తి వివరాలతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని,సుమోటో ప్రకటనతో ప్రభుత్వం ముందుకు వస్తుందని సభకు హామీ ఇచ్చారు. కానీ ఇలా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని, ఇది భారత కాంగ్రెస్, ఇండియా కూటమి బాధ్యతారాహిత్యమని నడ్డా విమర్శించారు. దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపిస్తూ విపక్షం నినాదాలు కొనసాగిస్తుండడంపై చైర్మన్ సిపి రాధాక్రిష్ణన్ జోక్యం చేసుకుని ప్రభుత్వం ప్రకటన చేస్తామని చెప్పినప్పుడు వినాలని సూచించారు. అయినా సరే విపక్షాలు వెనక్కు తగ్గకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు చొచ్చుకుని వెళ్లారు.

నడ్డా మాట్లాడుతూ ప్రభుత్వం ఈరోజే దీనిపై సుమోటో స్టేట్‌మెంట్ ఇస్తుందని దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతీదీ రాజకీయం చేయడం వారికి ఆసక్తి అని, దానికి ఉదాహరణ ఇప్పుడు జరుగుతున్నదేనని నడ్డా విపక్షాలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చర్చకు దూరంగా ఉంటుందని దేశంలో వాతావరణం సృష్టించడానికి వారు ప్రయత్నిస్తున్నారని నడ్డా వ్యాఖ్యానించారు. “చర్చించడానికి ఎలాంటి అంశాలు లేని పార్టీ మీది. ఇది బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన. ఒకవిధంగా దేశ వ్యతిరేక ప్రవర్తన ” అని నడ్డా విపక్షంపై ధ్వజమెత్తారు. టిఎంసి తప్ప మిగతా విపక్షాలన్నీ నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశాయి. టిఎంసి సభ్యుడు సాకేత్ గోఖలే కూడా సభలో కొంతసేపు కూర్చుని వాకౌట్ తరువాత బయటకు వెళ్లారు. “సర్‌” బాధిత కుటుంబాలపై ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా తాము వేరేగా వాకౌట్ చేశామని టిఎంసి వెల్లడించింది.