Reading Time: < 1 minute

దుబాయ్ : ఇన్నాళ్లూ అమెరికాతో ఎలాంటి చర్చలకు ఇష్టపడని ఇరాన్ ఇప్పుడు కాస్త వెనక్కు తగ్గింది. ఈ నేపథ్యంలో అమెరికాతో న్యాయమైన రీతిలో సమాన స్థాయిలో చర్చలు జరిగేలా చూడాలని ఇరాన్ విదేశాంగ మంత్రిని ఆదేశించానని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ మంగళవారం వెల్లడించారు. గతనెల ఇరాన్ దేశం అంతా ఆందోళనలతో అట్టుడికిన ఉద్రిక్త పరిస్థితుల్లో అమెరికాతో చర్చలకు ఇరాన్ సిద్ధం కావడం విశేషం. ఆందోళన సాగిస్తున్న ఇరాన్ ప్రజలను కొన్ని వారాల పాటు హెచ్చరిస్తూ వచ్చిన అధ్యక్షుడు ఇప్పుడు పరిస్థితి అదుపు తప్పడంతో చర్చలకు సంకేతాలు అందించారు. అంతేకాదు ఇరాన్ సుప్రీం అయతుల్లా అలి ఖమేనీ కూడా ఈ విషయంలో తనకు మద్దతు ఇచ్చినట్టు మసూద్ వెల్లడించారు.

ఇదివరకు ఖమేనీ చర్చలన్న ప్రసక్తి లేకుండా తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా ఒప్పందానికి పెట్టిన డిమాండ్ల మేరకు ఎంతవరకు ఇరాన్ ఒక ఒప్పందానికి వస్తుందో వేచి చూడాల్సిందే. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అణుఒప్పందంపై ఇరాన్ దిగిరావాలన్న పట్టుదలతో ఉన్నారు. గత జూన్‌లో ఇరాన్ కు వ్యతిరేకంగా 12 రోజుల పాటు ఇజ్రాయెల్ యుద్ధం సాగించగా, ఇరాన్ లోని మూడు అణుస్థావరాలపై బాంబు దాడులకు ట్రంప్ ఆదేశించిన సంగతి తెలిసిందే. మధ్యప్రాచ్య రీజియన్‌లో మిత్రదేశాలు అమెరికాతో ఇరాన్ చర్చలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించి అభ్యర్థించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ వెల్లడించారు. అయితే ఇరాన్ చర్చలకు సుముఖత చూపిస్తున్న విషయం అమెరికా ఇంకా నిర్ధారించవలసి ఉంది.