
న్యూఢిల్లీ: భారత్‌పై గతంలో అమెరికా 50 శాతం సుంకాలు విధించిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ అన్నారు. అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలపై గోయెల్ కౌంటర్ ఇచ్చారు. మెరైన్, సీఫుడ్, వస్త్ర ఎగుమతిదారులు సుంకాలు తగ్గాలని ఆశించారని తెలిపారు. ఇటీవల వరకు అమెరికా ఒప్పందం ఎప్పుడని విపక్ష నేతలు ప్రశ్నించారని అన్నారు. రాహుల్ గాంధీ ద్వంద్వ విధానాలు పాటిస్తున్నారని మండిపడ్డారు. 2011లో చైనాతో ఎఫ్‌టిఎ కుదుర్చుకునే పాపం రాహుల్ చేశారని గోయెల్ ధ్వజమెత్తారు. చైనాతో ఎఫ్‌టిఎ నుంచి భారత్‌ను మోదీ కాపాడారని తెలిపారు.
వ్యవసాయం, డెయిరీ రంగాల్లో భారత్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని గోయెల్ అన్నారు. వ్యవసాయం, డెయిరీ రంగాలను ప్రధాని మోదీ అగ్రగామిగా నిలిపారని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ నాశనం చేసిందని మండిపడ్డారు. భారత్ ఎదుగుదలను రాహుల్ గాంధీ ఎందుకు సహించట్లేదని ప్రశ్నించారు. ప్రతికూల ఆలోచనలతో దేశ ప్రజలను రాహుల్ తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీకి వాస్తవాలు రుచించట్లేదని పేర్కొన్నారు.