Reading Time: 2 minutes

న్యూఢిల్లీ : ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ పై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీపై అసహనం వ్యక్తం చేసింది. భారత్‌లో కార్యకలాపాలు సాగించాలంటే ఇక్కడి చట్టాలను పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ఈమేరకు వాట్సాప్ మాతృసంస్థ మెటాకు మంగళవారం సుప్రీం కోర్టు హెచ్చరిక జారీ చేసింది. “ మా దేశ గోప్యతతో మీరు ఆడుకోలేరు. మా డేటాకు సంబంధించి ఒక్క అంకెను పంచుకోవడానికి మిమ్మల్ని అనుమతించము’ అని అమెరికాకు చెందిన మెటాను సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మందలించారు. దేశ చట్టాలను పాటించకపోతే భారతదేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. వాట్సాప్ 2021ప్రైవసీ పాలసీకి సంబంధించిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తాజాగా విచారించింది.

వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగదారుల డేటాను పంచుకోవడం దోపిడీ అని ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. దేశం లోని లక్షలాది మంది పేదలు, చదువురాని ప్రజలు ప్రైవసీ పాలసీని అర్థం చేసుకోగలరా అని మెటా ప్రతినిధులను చీఫ్ జస్టిస్ సూటిగా ప్రశ్నించారు. కొన్ని సందర్భాల్లో మెటా పాలసీలు అర్థం చేసుకోవడం తమకే ఇబ్బందిగా మారుతోందని, ఒకసారి తనకు ఓ వైద్యుడు వాట్సప్‌లో మందుల ప్రిస్క్రిప్షన్ పంపితే దానికి సంబంధించిన ప్రకటనలే ఫోన్‌లో కనిపించాయన్నారు. ఇక దేశం లోని లక్షలాది మంది పేద, చదువురాని ప్రజలు ఈ విధానాలను ఎలా అర్థం చేసుకుంటారని ప్రశ్నించారు. కాగా, మెటా ఇంజినీరింగ్ బృందం ఇతరుల వాట్సాప్ మెసేజ్‌లను చదవగలదని వాట్సాప్ అంతర్జాతీయ వినియోగదారుల బృందం ఇటీవల అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీం కోర్టు హెచ్చరికలు మెటాను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి.

ప్రైవసీ పాలసీ

2021 జనవరిలో వాట్సప్ తీసుకొచ్చిన కొత్త పాలసీ ప్రకారం యూజర్లు వాట్సప్ బిజినెస్ అకౌంట్లతో జరిపే సంభాషణకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకునేందుకు అనుమతి లభిస్తుంది. కొత్త పాలసీకి అంగీకరించని వారి ఖాతాలను రద్దు చేస్తామని తొలుత హెచ్చరించింది. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని అభ్యంతరాలు రావడంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పాలసీ అమలును నిలిపివేయాలని ఆదేశించింది.ఐటీ చట్టం లోని నిబంధనలకు ఈ కొత్త పాలసీ పూర్తి విరుద్ధంగా ఉందని తేల్చి చెప్పింది. ఈ పాలసీపై దాఖలైన పిటిషన్‌పై తాజాగా విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.