Reading Time: < 1 minute

త్వరలో ప్రారంభమయ్యే టి-20 ప్రపంచకప్ తర్వాత క్రికెట్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం అవుతుంది. అయితే ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓ భయం వెంటాడుతుంది. అదేంటంటే.. ఈ సీజన్‌కి కెప్టెన్ పాట్ కమ్మిన్స్ అందుబాటులో ఉంటాడా..? లేదా..? అనే ప్రశ్న కలవర పెడుతోంది. ఎందుకంటే కమ్మిన్స్ ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడిని ప్రపంచకప్ జట్టుకు కూడా ఎంపిక చేయలేదు.

మరి ఐపిఎల్ ప్రారంభమయ్యే సమానికి కమ్మిన్స్ అందుబాటులోకి వస్తాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే తాను ఐపిఎల్‌కి అందుబాటులో ఉంటానని కమ్మిన్స్ హింట్ ఇచ్చాడు. ‘‘వరల్డ్ కప్‌ టోర్నీ నుంచి వైదొలగడం నిజంగా దురదృష్టకరం. అడిలైడ్ టెస్ట్ తర్వాత నా గాయం తిరగబెట్టింది. అయితే 4 వారాల్లోనే కోలుకుంటానని అనుకున్నాను. కానీ, తాజా స్కాన్ తర్వాత మరికొన్ని వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. అందుకే ఈ మెగా టోర్నీకి దూరంగా ఉండాల్సి వస్తుంది’’ అని కమ్మిన్స్ అన్నాడు.

అయితే మరికొన్ని రోజుల్లో మళ్లీ స్కాన్ చేయించుకుంటానని.. ఒకవేళ ఆ రిపోర్ట్ గనుక సానుకూలంగా వస్తే.. అప్పటి నుంచి నెమ్మదిగా ప్రాక్టీస్ మొదలుపెడతానని పేర్కొన్నాడు. త్వరలో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తాను అని తెలిపాడు. దీంతో ఐపిఎల్‌కి కమ్మిన్స్ అందుబాటులో ఉంటాడని అభిమానులు భావిస్తున్నారు.