Reading Time: 2 minutes
Union Budget 2026 Bharat Vistar Ai Tool Farmers Agriculture

Union Budget 2026: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో రైతులకు తీపికబురు అందించారు. ఆదివారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయం కేవలం పంటల వరకే పరిమితం కాదని, టెక్నాలజీతో కలిపి రైతుల ఆదాయాన్ని పెంచాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఒక కొత్త, ఆసక్తికరమైన పథకాన్ని ప్రకటించారు. దాని పేరు ‘భారత్ విస్తార్’. ఇది కృత్రిమ మేధస్సు(AI) ఆధారంగా పనిచేసే ప్రత్యేక డిజిటల్ సాధనం. ముఖ్యంగా ఇది అనేక భాషల్లో పనిచేయడం దీని ప్రత్యేకత. దేశంలో ఇప్పటికే ఉన్న అగ్రి-స్టాక్ పోర్టల్స్‌, ఐసీఏఆర్‌ (వ్యవసాయ పరిశోధనా సంస్థ) ఇచ్చే సాగు సూచనలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా ఈ టూల్ రూపొందించనున్నారు. రైతులు తమ భాషలోనే పంటలు, సాగు పద్ధతులు, ఆధునిక సాంకేతికతపై సమాచారం పొందేలా చేయడమే దీని లక్ష్యంగా ఆర్థిక మంత్రి తెలిపారు. అంటే, టెక్నాలజీ నేరుగా రైతు చేతిలోకి వెళ్లేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

READ MORE: SuryaKumar Yadav: సంజూ స్థానంలో ఇషాన్ కిషన్‌ కీపింగ్.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ సూర్యకుమార్!

బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గ్రామీణ జీవనోపాధులపై సైతం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఒకే పంటపై ఆధారపడకుండా, ప్రాంతానికి తగిన పంటలు పండించేలా ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పారు. దీని వల్ల రైతుల ఆదాయం పెరగడమే కాకుండా, గ్రామాల్లో కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయని ఆమె వివరించారు. తీర ప్రాంతాల్లో కొబ్బరి, చందనం, కోకో, జీడిపప్పు వంటి విలువైన పంటలను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఇవి దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉన్న పంటలు కావడంతో రైతులకు ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో అగర్ చెట్ల సాగుకు మద్దతు ఇస్తామని చెప్పారు. అగర్ చెట్లు పరిమళ ద్రవ్యాల తయారీలో ఉపయోగపడతాయి కాబట్టి అక్కడి రైతులకు కొత్త ఆదాయ మార్గంగా మారనున్నాయి. పర్వత ప్రాంతాల్లో ఉన్న రైతుల కోసం ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు. బాదం, వాల్నట్‌, పైన్ నట్స్ వంటి గింజల సాగును ప్రోత్సహిస్తామని చెప్పారు. ఇవి ఖరీదైన పంటలు కావడంతో, సరైన మద్దతు లభిస్తే అక్కడి రైతుల జీవన స్థాయి గణనీయంగా మెరుగవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

READ MORE: Ram Charan: ‘ఇంత ఆనందంలో మాటలు రావడం లేదు’.. రామ్ చరణ్ భావోద్వేగం!