
శ్రీహరికోట : మరో కీలక ప్రయోగానికి ఇస్రో సిద్ధం అయింది. భూమి పరిశీలలనకు ఉద్ధేశించిన శాటిలైట్‌ను, మరో 14 ఉపగ్రహాలతో నిర్ణీత కక్షల్లోకి పిఎస్‌ఎల్‌వి రాకెట్ ద్వారా పంపిస్తారు. ఈ దిశలో పిఎస్‌ఎల్‌వి ప్రయోగానికి 22.5 గంటల కౌంట్‌డౌన్ ఆదివారం శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలోని సతీష్ ధావన్ ప్రయోగ స్థలిలో ఆరంభం అయింది. కొత్త సంవత్సరంలో ఇస్రోకు ఇది తొలి అంతరిక్ష ప్రయోగం అవుతుంది. ఇస్రోకు చెందిన వాణిజ్యపరమైన ప్రయోజనాల విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్) తరఫున శాటిలైట్లను ప్రయోగించడం జరుగుతుంది. సంబంధిత ప్రక్రియకు కౌంట్‌డౌన్ ఆరంభం అయినట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి.
ప్రధానమైన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌తో పాటు దేశీయ , విదేశీయ ఉపగ్రహాలను పిఎస్‌ఎల్‌వి ద్వారా నింగిలోకి పంపించేందుకు అవసరం అయిన అన్ని సాంకేతిక ఏర్పాట్లు జరిగాయి. ప్రయోగాన్ని వాతావరణ పరిస్థితుల బేరీజు తరువాత రీషెడ్యూల్ చేశారు. సోమవారం ఉదయం 10.18 గంటలకు పరీక్ష నిర్వహిస్తారు. ఆదివారం మధ్యాహ్నం 12.48 గంటలకు కౌంట్‌డౌన్ చేపట్టారు. పిఎస్‌ఎల్‌వి సి 62 /ఇఒఎస్‌ఎన్ 1 మిషన్‌గా పిలిచే ఈ ప్రయోగంలో భాగంగా ముందుగా థాయ్‌లాండ్, యుకెలు నిర్మించిన భూ శాటిలైట్‌ను కక్షలోకి పంపిస్తారు. తరువాతి దశలో మిగిలిన వాటిని తరలిస్తారు.