Reading Time: 3 minutes

 భారతదేశ స్ఫూర్తిని ఈ ఆలయం ప్రపంచానికి చాటుతోంది

గత ప్రభుత్వాలు కొన్ని చరిత్రను తుడిచిపెట్టే కుటిల యత్నాలు చేశాయి

రాష్ట్రపతి కూడా సందర్శించకుండా అడ్డంకులు

విద్వేషశక్తులతో జాగ్రత్తగా ఉండాలి

సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌లో ప్రధాని మోడీ వ్యాఖ్యలు

యోధుల స్మరణకు గుర్తుగా 108 అశ్వాలతో ఊరేగింపు

సోమనాథ్ : విఖ్యాత, జాతీయ ఆత్మాభిమాన సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం నచ్చని శక్తులు ఇంకా పొంచి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. ఇటువంటి దుష్టశక్తులు తిరిగి తలెత్తకుండా వారిని దెబ్బతీయా ల్సి ఉందని పిలుపు నిచ్చారు. చారిత్రాత్మక అంతకు మించిన ఆధ్యాత్మిక ప్రాధాన్యత సోమనాథ్ మందిరానికి ఉంది. ఈ ఆలయ పునరుజ్జీవం రుచించని వారు మన మధ్యనే చురుగ్గా తిరుగుతున్నారు. ఈ దశలో దేశ ప్రజలు జాగరూకతతో ఉండాలి. వారిని ఓడించేందుకు సంఘటితం, పటిష్టం కావాల్సి ఉం దని తెలిపారు. ఆదివారం గుజరాత్‌లోని సోమనాథ్ లో జరిగిన సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. గిర్ సోమనాథ్ జిల్లాలో ఈ ఆలయం నెలకొని ఉంది. తరచూ ఈ ఆల యం పరాయి పాలకుల దాడులకు, ఆక్రమణదారు ల దొంగదెబ్బలకు గురైంది. అయితే ఇదే క్రమంలో మన సంకల్పబలంతో ఆలయ మరమ్మత్తులు, పునర్నిర్మాణ పనులు సాగుతూ వచ్చాయి.

తొలి సారి ఈ ఆలయంపై దాడి జరిగి వేయి సంవత్సరాలు పూర్తి అవుతున్న దశలో సోమనాథుడి కోసం ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ప్రధాని తెలిపారు. ఖడ్గం ఝుళిపింపులతో జనం హృదయాలను జయించలేరని సోమనాథ్ ఆలయం నిరూపించిందని వ్యాఖ్యానించారు. భారతీయ నాగరికత సంబంధిత వైభవం మొక్కవోనిది. మహనీయం అయినది. దీనిని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణంతో మనం నిరూపితం చేసుకున్నామని, ఇప్పుడు జరిగే కార్యక్రమాలు జాతికి గర్వకారణం అన్నారు. భగవాను శివుడి నిలయం అయిన సోమనాథ్ ఆలయం దేశ ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిందని వివరించారు. ఒక ధ్వంసరచనను లెక్కచేయకుండా జాతి సంకల్పబలంతో ఏ విధంగా తిరిగి పూర్వ వైభవం సంతరించుకునేలా చేసుకున్నామనేది ఈ మందిరం చెపుతుందని ప్రధాని తెలిపారు. విద్వేషకర శక్తులు ఆలయంపై విరుచుకుపడితే కొందరు దీనిని తమ సంకుచిత బుద్ధితో ఇది అత్యంత సాధారణ విషయం అని కొట్టిపారేశారని ప్రధాని మోడీ కాంగ్రెస్ పూర్వపు నేతలపై పరోక్ష విమర్శలకు దిగారు.

మతపరమైన ద్వేషంతోనే దాడులు, ధ్వంసం

మతపరమైన ద్వేషంతోనే ఆలయంపై దాడులు జరిగితే అదేమీ లేదనే రీతిలో చరిత్రను వక్రీకరించారు. అక్కడ జరిగింది కేవలం ఓ దొమ్మి, నిధులు నిక్షేపాల దోపిడికి సాగిన చర్య అని ప్రచారం చేశారని విమర్శించారు. వేయి ఏండ్ల క్రితం ఇక్కడ భారీ స్థాయిలో దాడి జరిగింది. తరువాత కూడా వరుస క్రమంలో ఆక్రమణలు దాడులు సాగుతూ వచ్చాయి. ఇదంతా కూడా మతపరమైన విద్వేషానికి నిలువెత్తు సాక్షం కాదా? అని ప్రశ్నించారు. మతపర తీవ్రవాదానికి మోకరిల్లే వారి వల్లనే సోమనాథ్ ధ్వంసం జరుగుతూ వచ్చింది. తమ మతం పట్ల అంకిత ఆరాధన భావం ఉన్న వారు ఎవరూ కూడా సోమనాథ్ ఆలయంపై దాడులను తేలిగ్గా తీసుకోరని తెలిపారు. వేయి ఏళ్లయినా ఆలయంపై జెండా ఎరుగుతూనే ఉందన్నారు

పటేల్ పట్టుదలతోనే పునరుజ్జీవం

దేశ స్వాతంత్య్రం తరువాత సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణ ప్రతిన వహించారు. అయితే ఈ దారిలో ఆయనకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ పట్టు వీడని పటేల్ అనుకున్న విధంగా ఆలయ పునర్నిర్మాణానికి దిగారు. ఆలయ పూర్వ వైభవాన్ని చాటారు. పునర్నిర్మాణం అయిన ఆలయ ప్రారంభోత్సవానికి కొందరు అడ్డుకున్నా, దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ విచ్చేశారని గుర్తు చేశారు. ఆయనను తరచూ నెహ్రూ అడ్డుకున్నారనే విషయాన్ని ప్రధాని మోడీ పేరు పెట్టుకుండా ప్రస్తావించారు. అయితే ఇంతటితో ఆలయ పునర్నిర్మాణ ఘట్టంపై నీలి నీడలు తొలిగిపోలేదు. ఇప్పటికీ ఆలయ నిర్మాణ వ్యతిరేక శక్తులు అంతర్గతంగా సంచరిస్తూనే ఉన్నాయని హెచ్చరించారు. వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

ఇతరుల నాగరికతల ప్రతీకలను దెబ్బతీయాలనుకునే శక్తుల సంస్కృతి వారసత్వాలు చివరికి నామరూపాలు లేకుండా పొయ్యాయని, చరిత్రలో ఇటువంటి ఉదంతాలు అనేకం అని తెలిపారు. సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేయడమే కాకుండా కొందరు మొఘలాయి రాజులు మందిరాన్ని మసీదు చేయాలనుకున్నారని ప్రధాని చెప్పారు. అయితే ఇటువంటి కుట్రలను తిప్పికొడుతూ సోమనాథ్ ఇప్పుడు మన ఆత్మవిశ్వాసం మచ్చుతునక అయి తళుక్కు మంటోందని తెలిపారు. ఈ ఉజ్వల ఘట్టాన్ని మనం అంతా గర్వపడే రీతిలో నిర్వహించుకోవల్సి ఉందని కోరారు.

సోమనాథ్ యోధుల స్మరణ

సోమనాథ్‌లో కీలక ఉత్సవం ముందు ఆదివారం ఉదయం విశేష రీతిలో శౌర్య యాత్ర జరిగింది. ప్రధాని మోడీ ఈ యాత్రను ముందుండి నడిపించారు. పరాయి శక్తుల ఆక్రమణల నుంచి సోమనాథ ఆలయాన్ని రక్షించుకునే క్రమంలో ప్రాణాలు వదిలిన వీరుల సంస్మరణలో ఈ యాత్ర జరిగింది. ఈ నేపథ్యంలో108 అశ్వాలతో ఊరేగింపు జరిగింది. యోధుల ధైర్యసాహసాలను వారి త్యాగాలను గుర్తు చేసుకునే రీతిలో విశేష యాత్ర జరిగింది. సోమనాథ్‌లోని శంఖు చౌక్ నుంచి వీర్ హమిర్జి గోహిల్ సర్కిల్ వరకూ జనం భారీ సంఖ్యలో నిలబడి ప్రధాని మోడీకి, శౌర్యయాత్రలోని వారికి స్వాగతం పలికారు. అభివాదాలకు దిగారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ముందు భాగాన ప్రధాని మోడీ వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నిలబడి ఉన్నారు.

ఒక కిలోమీటరు వరకూ సాగిన యాత్ర దశలో ప్రజలకు ప్రధాని మోడీ ఉత్సాహంగా అభివాదం తెలుపుతూ వచ్చారు. ఇక్కడకు వచ్చిన సందర్భంగా ప్రధాని మోడీ ఆలయంలో రెండో రోజు కూడా ప్రార్థనలు నిర్వహించారు. వల్లభ్‌భాయ్ పటేల్‌కు నివాళులు అర్పించారు. ఆలయం సమీపంలో పటేల్ విగ్రహం ఏర్పాటు అయి ఉంది. ప్రధాని శకటం వెంట కొందరు యువ పూజారులు రుషికుమారుల వస్త్రధారణతో నడిచారు. వారి చేతుల్లో శివుడి ప్రత్యేక వాయిద్యం డమరుకం ఉంది. బృందం డమరుకం మోగిస్తూ వాహనం వెంట నడిచింది. పూజారుల నుంచి రెండు డమరుకాలను తీసుకున్న ప్రధాని మోడీ వాహనంపై నిలబడి ఉన్నప్పుడు వాటితో డమరుకం మోగించారు. శౌర్యయాత్ర దారిపొడవునా పట్టు పరికిణిలు ,చీరలు ధరించి నుదుటిన కుంకుమతో ఉన్న యువతులు చేతుల్లో మంగళహారతులతో ప్రధానికి స్వాగతం పలికారు.