Reading Time: < 1 minute

అమరావతి: రాజకీయాల్లో వారసత్వాన్ని ప్రోత్సహించడం తనకు నచ్చదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు గుర్తుచేయాలని అన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని స్వర్ణభారత్ ట్రస్ట్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో వెంకయ్య నాయుడు పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తు బాగుండాలంటే ప్రకృతితో కలిసి జీవించాలని, మన పండుగలన్నీ ప్రకృతితోనే ముడిపడి ఉన్నాయని తెలియజేశారు. స్వర్ణభారత్ ట్రస్ట్ నే తమ అమ్మాయికి వారసత్వంగా ఇస్తున్నానని, స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా సుమారు లక్షమందికి పైగా ఉచితంగానే భోజనం, వసతి కల్పించి శిక్షణ ఇస్తున్నామని అన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు మరచిపోకూడదనే ఏటా స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండుగలు నిర్వహిస్తున్నామని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

కేంద్రం, రాష్ట్రం అందరం కలిసి రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసుకున్నామని, అమరావతి అంటే గుంటూరు, గన్నవరం, విజయవాడ, తాడికొండ అని అన్నారు. అమరావతి ఒక రూపురేఖలు దిద్దుకుంటుందని, అమరావతి పూర్తిగా అభివృద్ధి చెంది.. మంచి పేరులోకి వస్తోందని భావిస్తున్నానని చెప్పారు. సిఎం చంద్రబాబు నాయుడు చర్యలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని, అందరూ కలిసి అమరావతిని అద్భుతంగా తయారు చేస్తారనే నమ్మకం ఉందని అన్నారు. అమరావతి అంశంలో వివాదాలు పెట్టుకోవద్దు అని.. అన్ని ప్రాంతాలకు మధ్యలో అమరావతి ఉంటుందని, తెలుగువాళ్లు అనవసర వివాదాలు పెట్టుకోవద్దని కోరారు. హైదరాబాద్ తరహాలోనే.. అమరావతిని అభివృద్ధి చేసుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు.