Reading Time: < 1 minute

 ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో అత్యాధునిక సౌకర్యాలతో 50 పడకల ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. హాస్పిటల్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే రూ.7.50 కోట్లను విడుదల చేశారు. టిజిఎంఎస్‌ఐడిసి పర్యవేక్షణలో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. హాస్పిటల్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టేందుకు వీలుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో అనువైన ఒక ఎకరం స్థలాన్ని వెంటనే కేటాయించాల్సిందిగా ఆయుష్ విభాగం డైరెక్టర్ డా. పి.శ్రీకాంత్ బాబు, జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. నిర్ణీత గడువులోగా నిధులు వినియోగించి, ప్రజలకు సేవలు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

ప్రస్తుతం ఆయుష్ సేవలు కేవలం డిస్పెన్సరీలకే పరిమితం కాగా, ఈ 50 పడకల దవాఖాన రాకతో ఇన్- పేషెంట్(ఐపి) సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. డయాబెటిస్, బిపి, కీళ్ల నొప్పులు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేదం, యునానీ, యోగా, ప్రకృతి చికిత్సల ద్వారా ఇక్కడ మెరుగైన వైద్యం లభించనుంది. ప్రజలకు మెడిసిన్‌తో పాటు సంప్రదాయ వైద్య విధానాలను కూడా చేరువ చేయాలన్న లక్ష్యంతో ఆయుష్ హాస్పిటల్‌ను మంజూరు చేశామని ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్, చుట్టు పక్కల ప్రాంత ప్రజలకు ఈ హాస్పిటల్ ఎంతో మేలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.