Reading Time: 15 minutes

మేషరాశి

ఆదాయం – 11, వ్యయం – 05 రాజపూజ్యం – 02, అవమానం – 04

మేష రాశి వారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు. చంద్ర రాశి నుండి రాహువు 11వ ఇంటిలో డిసెంబర్ ఐదవ తేదీ వరకు సంచరిస్తాడు. తదుపరి డిసెంబర్ 5 తరువాత పదోవ ఇంటిలో సంచరిస్తాడు. రాహువు దశమంలో సంచరించడం వలన వృత్తిపరంగా అనుకూలంగానే ఉంటుంది. ఆదాయ మార్గాలు ఊహించని విధంగా పెరుగుతాయి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా బాగానే కలిసి వస్తుంది. జూన్ రెండవ తేదీ వరకు గురువు తృతీయ స్థానంలో ప్రవేశిస్తారు. మేష రాశివారికి శ్రమతో కూడినటువంటి విజయాలు ఉంటాయి. మీరు కష్టపడితేనే దానికి తగినట్టు విజయాలు అందుకోగలుగుతారు. వీరికి ఏలిన నాటి శని నడుస్తోంది, ఈ కాలంలో ఫిజికల్గా యాక్టివ్ గా ఉండండి. శనికి బద్ధకస్తులు అంటే నచ్చదు. మీరు కష్టపడితేనే మీకు ప్రతిఫలాన్ని అందిస్తాడు. అదృష్టాన్ని మాత్రం నమ్ముకోవద్దు. జూన్ రెండవ తేదీ తర్వాత గురువు నాలుగవ ఇంటిలోకి సంచరిస్తాడు. ఈ సమయంలో గృహ యోగం వాహన యోగం ఏర్పడుతుంది. అక్టోబర్ 30వ తేదీ తర్వాత గురువు నాల్గవ ఇంటి నుండి 5వ ఇంటిలోకి సంచరిస్తాడు. అక్టోబర్ 30వ తేదీ తర్వాత ఐదవ ఇంటిలో గురువు కేతువుతో కలిసి ఉండడం వలన గణేశ యోగం అనేది ఏర్పడుతుంది. అన్ని పనులలో అనుకూలంగా ఉంటుంది. శని 12వ ఇంటిలో ఉండడం వలన ఆరోగ్య సమస్యలు ఎక్కువగా లేనప్పటికీ నిద్రకు భంగం వాటిల్లుతుంది. ఆరోగ్య పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అయిదవ ఇంటిలో కేతు ఉండటం వలన జీర్ణ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.

మేష రాశి అధిపతి అయినటువంటి కుజుడు ఫిబ్రవరి 22వ తేదీ వరకు పదవ ఇంటిలో అంటే మకర రాశిలో ఉంటాడు. ఈ సమయంలో కెరియర్ పరంగా మంచి అభివృద్ధి గుర్తింపు లభిస్తుంది. ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు 11వ ఇంటిలో అంటే కుంభ రాశిలో ఉంటాడు. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. ఏప్రిల్ రెండవ తారీకు నుండి మే 12వ తేదీ వరకు 12వ ఇంటిలోకి వస్తాడు. ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. విదేశీ ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడతాయి. మే 11 నుండి జూన్ 21వ తేదీ మధ్యకాలంలో కుజుడు మేషరాశిలోకి వస్తారు. ఈ సమయంలో వ్యక్తిగతంగా శక్తి ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెరుగుతాయి. మేష రాశాధిపతి బలం కలిగి ఉండటం వలన ఉత్సాహంగా ఉండగలుగుతారు. కానీ ఇదే సమయంలో తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది.

జూన్ 21 నుండి ఆగస్టు రెండు వరకు కుజుడు రెండవ ఇంటిలో ఉంటాడు. ఈ సమయంలో ఆర్థిక విషయాల పైన కుటుంబ విషయాలు పైన దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఆగస్టు 2 నుండి సెప్టెంబర్ 18 మధ్యకాలంలో కుజుడు మళ్లీ మూడవ ఇంటిలోకి కుజుడు వెళ్తాడు. ఈ సమయంలో సహోదరి సహోదరుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు తొలగిపోతాయి. రక్తసంబంధీకులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. సెప్టెంబర్ 18 నుండి నవంబర్ 12వ తేదీ వరకు కుజుడు నాలుగో ఇంటిలోకి వస్తాడు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అవుతాయి. నవంబర్ 12వ తేదీ నుండి సంవత్సరం చివరి వరకు కూడా కుజుడు అయిదవ ఇంటిలో అంటే సింహరాశిలో ఉంటాడు. సంతానం యొక్క భవిష్యత్తు అనేది బాగుంటుంది. కేతువు ఐదవ ఇంటిలో సంచరించడం వలన విద్యార్థులు చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

మేష రాశి వారికి ఏలిన నాటి శని కొనసాగుతుంది కాబట్టి శనికి సంబంధించిన వస్తువులను దానంగా ఇవ్వండి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. 12వ స్థానంలో అంటే వ్యయ స్థానంలో శని సంచరిస్తున్నారు కాబట్టి ఆరోగ్య విషయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా అవసరం అవుతాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు మాత్రం లభిస్తుంది. మీరు అనుకున్న పనులు సాధించడానికి అధికంగా కష్టపడవలసి ఉంటుంది. రాహువు ఏకాదశ స్థానంలో ఉండటం వలన వ్యాపారస్తులకు ఆకస్మిక ధన లాభాలు కానీ వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద ఈ సంవత్సరం మేషరాశి వారికి బాగుంటుందని చెప్పవచ్చు. ఈ రాశి వారు అన్నివిధాలుగా బాగుండడానికి అఘోర పాశుపతహోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే 8 మంగళవారాలు ఆంజనేయ స్వామికి అభిషేకం, 8 శనివారాలు శనికి తైలాభిషేకం, నువ్వులు దానంగా ఇవ్వండి.

వృషభ రాశి

ఆదాయం 05, వ్యయం 14, రాజపూజ్యం 05, అవమానం 04

వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యమైన గ్రహం అయినటువంటి శని భగవానుడు సంవత్సరం మొత్తం కూడా శుభ స్థానంలో ఉంటారు. అనగా లాభ స్థానంలో మీన రాశిలో ఉంటారు. గురువు జూన్ రెండవ తేదీ వరకు 12వ స్థానంలో ఉంటారు. కాబట్టి వ్యాపార పరంగా సంవత్సర ప్రథమార్తంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నష్టాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ద్వితీయార్థంలో ఆర్థిక మరియు ఇతర పరిస్థితులు మెరుగుపడతాయి. అక్టోబర్ 31వ తేదీ తర్వాత గురువు ధన స్థానంలోకి వచ్చినప్పటి నుండి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అనుకూలమైన పరిస్థితులు పెరుగుతాయి.

రాహువు పదవ ఇంటిలో ఉండటం అనేది వృత్తిపరంగా అనుకూలించేది అని చెప్పవచ్చు. కేతువు నాలుగో ఇంటిలో ఉండటం మాత్రం అనుకూలమైన విషయం కాదు. నాలుగవ స్థానం అంటే మాతృ స్థానం కుటుంబ స్థానం గృహస్థానంగా చెప్పవచ్చు. కేతువు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితిలను సృష్టిస్తాడు. నాలుగవ స్థానంలో కేతువు డిసెంబర్ 5వ తేదీ వరకు ఉంటాడు కాబట్టి ముఖ్యంగా జూన్ రెండవ తేదీ వరకు గురు బలం ఉంటుంది కాబట్టి తల్లి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గృహ సౌఖ్యం విషయంలో కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణ కోసం జాగ్రత్తగా తీసుకోవాలి. ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా రావలసినటువంటి పాత రుణాలు ఈ కాలంలో వసూలు అవుతాయి. గురువు 2వ స్థానంలో ఉన్నంతవరకు ఈ వృషభ రాశి వారు సంవత్సర ప్రధమార్ధంలో అనగా జూన్ రెండవ తేదీ వరకు ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో, ఆరోగ్యం విషయంలో, ఆర్థిక పరమైన విషయాలలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది.అక్టోబర్ 31వ ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి ఖర్చులు తగ్గుతాయి పొదుపు పెరుగుతుంది. వృత్తి పరంగా వృషభ రాశి వారికి తిరుగులేని విధంగా ఉంటుంది. ఎందుకంటే కర్మ స్థానంలో రాహువు ఉన్నారు కాబట్టి. 11వ ఇంటిలో శని భగవానుడు ఉంటారు కాబట్టి మంచి యోగాలను ఇస్తాడు. శని వలన మీ శ్రమకు తగిన గుర్తింపు లభించి ఆర్థిక లాభాలు పెరుగుతాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. కేతువు నాలుగవ ఇంటిలో ఉంటారు కాబట్టి గృహ సౌఖ్యాన్ని కూడా తగ్గిస్తాడు. వివాహ సంబంధ విషయాలలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి జీవితభాగస్వామితో ఓర్పుతో మీ నిర్ణయాలను తెలియజేయవలసి ఉంటుంది. కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాలా మంచిది.

వ్యాపార పరంగా కొత్త అవకాశాలు నూతన పెట్టుబడును కలిసి వస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ మెటల్స్ కు సంబంధించిన వ్యాపారం కానీ ఇనుము మరియు హోటల్ వ్యాపారం కానీ వ్యవసాయనికి సంబంధించిన వ్యాపారంలో కానీ అధిక లాభాలను పొందగలుగుతారు. జూన్ వరకు మాత్రం నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కష్టపడితేనే దానికి తగిన ఫలితాన్ని అందించే శని భగవానుడు మీకు అనుకూలంగా ఉన్నాడు. కేతువు నాలుగవ ఇంటిలో డిసెంబర్ 5వ తేదీ వరకు ఉంటారు కాబట్టి కుటుంబ విషయాలలో చిన్నచిన్న అపర్తాలు కానీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కానీ జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఆర్థిక పరంగా మాత్రం ఖర్చులు మీరు ఊహించిన దాని కంటే కూడా ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ప్రథమార్తం అద్భుతంగాను ద్వితీయార్థం మోస్తారుగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశి వారు అన్నివిధాలుగా బాగుండడానికి దక్షిణామూర్తి హోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే 8 గురువారాలు దత్తాత్రేయ స్వామికి అభిషేకం, దక్షిణామూర్తి రూపు మేడలో వేసుకోండి.

మిధున రాశి

ఆదాయం 08, వ్యయం 11, రాజపూజం 01, అవమానం 07

మిధున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పవచ్చు. మిధున రాశి వారికి ఈ సంవత్సరం గురువు అనుకూలిస్తాడు. జనవరి ఒకటో తేదీ నుండి జూన్ ఒకటవ తేదీ వరకు గురువు జన్మ రాశిలోనే వుంటారు. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ ధన స్థానంలోకి గురువు ప్రవేశిస్తారు. అక్టోబర్ 31వ తేదీ నుండి గురువు సంవత్సరం చివరి వరకు సింహరాశిలో ఉంటారు. అంటే మీ మూడవ ఇంటిలోకి ప్రవేశిస్తారు. అదేపరంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం అత్యంత లాభదాయకమైన సంవత్సరంగా చెప్పవచ్చు. జూన్ రెండవ తేదీ నుండి గురువు ధన స్థానంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో కుటుంబ సంపద పెరుగుతుంది. ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. అప్పులు చాలా వరకు తీర్చగలుగుతారు. నూతన పెట్టబడులు పెడతారు విలువైన ఆభరణాలు వస్తువులు కొనుగోలు చేస్తారు. వాక్ శుద్ధి పెరుగుతుంది. ఈ మాట తీరు మెరుగుపడుతుంది. రాహువు 9వ స్థానంలో కేతువు మూడవ స్థానంలో పరాక్రమ స్థానంలో సంచరించడం వలన మీలో ధైర్యం ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతాయి. ఏ పనినైనా పట్టుదలతో సాధిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు తీర్థయాత్రలు దైవదర్శనాలు ఎక్కువగా చేస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా మారుతాయి. సహోదరీ సహోదరులతో మాత్రం కొంత అన్యోన్యత తక్కువగా ఉంటుంది.

రాహువు 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచరించడం వలన అదృష్టం అనేది ఆకస్మత్తుగా కలిసి వస్తుంది. విదేశీ విద్య కోసం విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. శని మీనరాశిలో ఉన్నారు కాబట్టి వృత్తి పరంగా పనిభారం అనేది పెరుగుతుంది. పదవ స్థానం అనేది వృత్తిని సూచిస్తుంది. పై అధికారులు మీ కృషిని మీ సామర్థ్యాన్ని గుర్తించడానికి కొంత సమయం పడుతుంది. ఆర్థిక పరంగా బాగుంటుంది. గురువు తన స్థానంలోకి ఎప్పుడైతే అడుగు పెడతారో వృత్తి వ్యాపారాల పరంగా ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఆర్థికంగా మాత్రం చాలా బలంగా ఉంటారు. ఆదాయమార్గాలకు లోటు ఉండదు. ఖర్చులు అదుపులో ఉంటాయి. రాహువు తొమ్మిదో ఇంటిలో ఉండి రాహువు దృష్టి 11వ స్థానంపై పడడం వలన ఆకస్మిక ధన లాభాలు కానీ ఊహించని పెద్ద మొత్తంలో ధనం రావడం అలాగే మీ శ్రమకు తగిన ఫలితం, గుర్తింపు తప్పకుండా లభిస్తుంది. వివాహం కానీ వారికీ వివాహ పరంగా అనుకూలంగా ఉంది, విదేశీ సంబంధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదా ఇక్కడే దూర ప్రాంత సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంటుంది. శుభకార్యాలు కచ్చితంగా ఈ సంవత్సరం నిర్వహిస్తారు. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంటుంది. విద్యలో పోటీ పరీక్షలలో ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. విద్యాపరంగా అవకాశాలను కలసివస్తాయి.

వైవాహిక సంబంధమైన విషయాలను చూసుకున్నట్లయితే శని పదవ స్థానంలో ఉన్నాడు కాబట్టి మిథున రాశి వారికి ఒక ప్రతికూలమైన అంశం ఏమిటంటే పదవ స్థానం అనేది వృత్తికి సంబంధించినది కాబట్టి జీవితభాగస్వామితో లేదా వ్యాపారంలో భాగస్వాములతో చిన్నచిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. గురు గ్రహ ప్రభావం వలన వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య సఖ్యత మరియు నమ్మకం పెరుగుతాయి. ఈ సంవత్సరం పనిభారం అనేది అధికంగా ఉంటుంది. శని కర్మ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరంగా కొన్నిఆటుపోట్లను ఎదుర్కొంటారు. మిధున రాశి వారికి ఈ సంత్సరం గురువు మరి కేతువు ఎక్కువగా యోగిస్తున్నారు. రాహువు కూడా యోగిస్తున్నాడు. గురువు ఎప్పుడైతే ధనస్థానంలోకి ద్వితీయంలో అడుగు పెడతారు అప్పుడు మీకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధనం అధికంగా సంపాదిస్తారు. మొత్తం మీద ఈ సంవత్సరం మిధున రాశి వారికి ప్రథమార్థం, ద్వితీయర్థం రెండు బాగున్నాయని చెప్పవచ్చు. ఈ రాశి వారు అన్నివిధాలుగా బాగుండడానికి రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే 8 సోమవారాలు శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం మంచిది. కాలభైరవ రూపు మేడలో వేసుకోండి మంచి ఫలితాలుంటాయి.

కర్కాటక రాశి

ఆదాయం 02, వ్యయం 11 రాజపూజ్యం 04, అవమానం 07

కర్కాటకరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. జనవరి నుండి మే నెల వరకు గురువు 12వ స్థానంలో ఉంటాడు. అంటే వ్యయ స్థానంలో ఉండటం వల్ల జాగ్రత్తగా ఉండవలసిన సమయమని చెప్పవచ్చు. దీనిని నష్ట స్థానంగా కూడా చెప్పవచ్చు. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. హాస్పటల్ సంబంధించి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కావున ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తలు వహించాలి. గురువు జూన్ రెండవ తేదీ తర్వాత జన్మరాశిలో ప్రవేశిస్తారు. దీనిని జన్మ గురువు అని కూడా అంటారు. అక్టోబర్ 31 తర్వాత గురువు ధనస్థానంలోకి సింహంలో వస్తారు. అప్పుడు ఆర్థికంగా ఇంకా మెరుగుపడుతుంది. ఉద్యోగ పరంగా కొన్ని సవాళ్లను అధిగమించవలసి ఉంటుంది. మీ శత్రువులు మీ కంటే కూడా చురుకుగా ఉంటారు ఒక అడుగు ముందు ఉంటారు. మానసికమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఒత్తిడి వల్ల కుటుంబ సభ్యులతో సమయం కేటాయించలేక పోతారు.

కర్కాటక రాశి వారికి ద్వితీయార్థంలో అత్యంత అనుకూలమైనదిగా చెప్పవచ్చు. స్థిరాస్తులను ఏర్పరచుకోగలుగుతారు. రుణాలను సాధ్యమైనంత వరకు తీరుస్తారు. శుభ కార్యాలు చేయగలుగుతారు.జూన్ మాసం తర్వాత ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉన్నత పదవులు లభిస్తాయి. కెరీర్ పరంగా చూసుకుంటే లాభదాయకంగానే ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి విజయవంతమైన ఫలితాలను ఇస్తాయి. కుటుంబపరంగా ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. వివాహంకాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. గురువు ఒకటో స్థానంలో ఉండి ఏడవ స్థానాన్ని అంటే మీ వివాహ స్థానాన్ని చూస్తాడు కాబట్టి గురువు ఐదవ స్థానం పైన కూడా దృష్టి పెడతాడు కాబట్టి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగు పడుతుంది. అక్టోబర్ 31వ తేదీ నుండి సంవత్సరం చివరి వరకు గురువు సింహరాశిలో ఉంటారు.ధనస్థానంలో గురువుఉండడం వాళ్ళ ఆర్థిక పరంగా స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఉద్యోగం మారడానికి చివరి ప్రయత్నం చేస్తున్నారు. అక్టోబర్ 31 తరువాత గురువు మారిన తర్వాత అనుకూలమైన ఫలితాలు పొందుతారు.

ముఖ్యంగా కర్కాటక రాశి వారికి రాహుకేతువులు అనుకూలంగా లేకపోవడం జూన్ మాసం వరకు గురువు కూడా అనుకూలంగా లేకపోవడం వలన కొన్నిఇబ్బందులు ఎదురవుతాయి. శని భాగ్య స్థానంలో ఉండటం అనేది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు.రాహువు 8వ ఇంటిలో ఉండటం వలన అప్పులు పెరిగే అవకాశాలు ఉంటాయి. వారసత్వ ఆస్తులకు సంబంధించి సమస్యలు ఏర్పడతాయి. కేతువు ధనస్థానంలో ఉండటం అనేది అనుకూలమైన కాలం కాదు. దీనివలన డబ్బు విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక పోతారు. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆర్థిక బాగుంటుంది, అలాగే వివాహ విషయంలోనూ ఇంకా ముఖ్యమైన విషయాలలో పురోగతి అనేది ఉంటుంది. జూన్ నుండి అక్టోబర్ వరకు ఎవరైతే వివాహం ప్రయత్నాలు చేస్తారో వారికి ఈ సమయంలో వివాహం నిశ్చయమవుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశి వారు అన్నివిధాలుగా బాగుండడానికి సుబ్రమణ్య పాశుపతహోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే 16 మంగళవారాలు సుబ్రమణ్య స్వామికి అభిషేకం చేయించండి మంచి ఫలితాలుంటాయి.

సింహరాశి

ఆదాయం 05, వ్యయం 05, రాజపూజ్యం 07 అవమానం 07.

సింహ రాశి వారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. లాభస్థానంలోగురువు ఉండటం వలన అదృష్ట సమయంగా చెప్పవచ్చు.విదేశీ సంబందించిన వ్యవహారాలు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఊహించని ధన లాభం కలుగుతుంది. మీరు ఎప్పుడో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు రావడం ప్రారంభమవుతుంది. ఉద్యోగ పరంగా పదోన్నతి ప్రమోషన్స్ లభిస్తాయి.వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. కాంట్రాక్టులో లీజులు రెన్యువల్స్ లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు తొలగిపోతాయి.

ఈ రాశి వారికి రాహు ఏడవ ఇంటిలో ఉండటం అనేది అనుకూలమైనది కాదు. మరియు ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం కూడా ఉంటుంది. అష్టమ శని నడుస్తుంది అంటే అన్ని అనుకూలంగా ఉండవని కాదు. కానీ ఆచితూచి వ్యవహరించాలి. అనుకూలమైన గురు గ్రహ ప్రభావం వలన ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించ గలుగుతారు. జూన్ 2వ తేదీ నుండి గురువు లాభ స్థానం నుండి వెయ్య స్థానంలోకి అడుగుపెడతాడు అనగా జూన్ రెండవ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ సమయంలో రాహుకేతువులు మరియు గురువు శని గ్రహాలు కూడా అనుకూలంగా లేవు. ఈ మధ్య సమయం సింహ రాశి వారికి కష్టమైన సమయంగా చెప్పవచ్చు. ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఈ ఖర్చులలో కూడా ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించినవి అయి ఉంటాయి. ఈ అష్టమ శని యొక్క ప్రభావం సంవత్సర ప్రథమార్ధంలో అంతగా మీకు కనిపించదు కానీ ద్వితీయార్థంలో చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయి వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మీరు పొదుపు చేసిన డబ్బు పెద్ద మొత్తంలో దాదాపుగా సంవత్సర ద్వితీయార్థంలో ఖర్చు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ నాకే తెలుసు అన్న ధోరణి అవలంబించవద్దు.

సంవత్సర ప్రథమార్ధంలో శని అనుకూలంగా లేకపోయినా గురుగ్రహం మిమ్మల్ని కాపాడుతుంది. కానీ సంవత్సర ద్వితీయార్థంలో మాత్రం అష్టమ శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా వ్యాయామం చేయడం యోగా మెడిటేషన్ చేయడం మరియు ఆరోగ్యం పైన దృష్టి పెట్టడం మంచిది. వ్యాపారపరంగా నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య ఎక్కువ తక్కువ అనే విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి కొన్ని కారణాల వల్ల కుటుంబ సభ్యులకు దూరంగా కాలం గడపవలసిన పరిస్థితి రావచ్చు. విదేశాలకు దేశాలకు వెళ్లడానికి మాత్రం అవకాశాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి. బయటి ఆహారాలకు జంక్ ఫుడ్ కి దూరంగా ఉండటం అన్ని విధాలా మంచిది.

వివాహం కానీ వారికి సంబంధాలు చేతిదాక వచ్చి చేజారిపోతాయి. 2026 అక్టోబర్ తరవాత మంచి సంబంధాలు వచ్చే అవకాశం వుంది. అక్టోబర్ 31వ తేదీన గురువు జన్మ రాశిలోకి వస్తారు సప్తమదృష్టి, పంచమ దృష్టి ఉండడం వలన వివాహకానీ వారికి వివాహం, సంతానం కోసం ప్రయత్నిస్తున్నవారికి సంతానం శుభవార్త వింటారు. నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి అక్టోబర్ 31 నుండి కూడా అనుకూలంగా ఉంటుంది. మిగతా సమయాలలో సింహరాశి వారు జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అక్టోబర్ తర్వాత ఆరోగ్య పరంగా మెరుగుదల కనిపిస్తుంది. ప్రతి రోజు కూడా సూర్యాష్టకం ఆదిత్య హృదయం చదవండి మంచి ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద సింహ రాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం బాగుంటుందని చెప్పవచ్చు ద్వితీయర్థం అంతంతమాత్రంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ రాశి వారు 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. కాలభైరవ రూపు మేడలో వేసుకోండి. హనుమాన్ వత్తులతో నిత్యం దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

కన్యా రాశి

ఆదాయం – 08, వ్యయం – 11 రాజపూజ్యం – 03, అవమానం – 03

కన్య రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. గడిచిన సంవత్సరం కంటే కూడా బాగుంటుందని చెప్పవచ్చు. సప్తమంలో శని, రాహువు కుంభరాశిలో అనగా మీ ఆరవ ఇంటిలో ఉంటారు. కేతువు 12వ స్థానంలో అంటే వ్యయ స్థానంలో వున్నారు. గురువు జూన్ రెండవ తేదీ వరకు దశమ స్థానంలో అంటే కర్మ స్థానంలో ఉంటారు. జూన్ 2 నుండి లాభ స్థానంలోకి అనగా 11వ స్థానంలోకి గురువు వస్తారు. అలాగే అక్టోబర్ 31వతేదీ నుండి వ్యయ స్థానంలోకి ప్రవేశం. ముఖ్య గ్రహాల స్థానాన్ని చూసుకున్నట్లయితే వృత్తి పరంగా ఆర్థికపరంగా గురువు కర్మ స్థానంలో ఉండటం వలన సంవత్సర ప్రథమార్తంలో ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నవారికి ఉద్యోగ అవకాశాలు కలసి వస్తాయి.గురువు యోగిస్తున్నాడు కాబట్టి ప్రభుత్వపరమైన ఉద్యోగం కానీ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాలకు గానీ ఎన్నిక కావడం జరుగుతుంది. వృత్తి పరంగా మాత్రం అభివృద్ధి బాగుంటుంది అని చెప్పవచ్చు అలాగే పనిలో ఒత్తిడి కూడా అదేవిధంగా ఉంటుంది.

జూన్ రెండవ తేదీ నుండి గురువు లాభ స్థానంలోకి అడుగుపెడతాడు. జూన్ రెండవ తేదీ నుండి ఈ కన్యా రాశి వారికి ఆర్థికంగా అద్భుతమైన లాభాలను అందుకోగలుగుతారు. మీరు పెట్టుబడి పెట్టిన సంస్థలనుండి రాబడి ఆకస్మిక ధన లాభం వంటివి కలుగుతాయి. రాహువు ఈ కన్యా రాశి వారికి ఆరవ ఇంటిలో ఉన్నాడు. రాహువు ఆరవ ఇంటిలో ఉండటం చాలా మంచి యోగం. మీ శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు. ఎంతో కాలంగా కోర్టు సమస్యల నుండి బాధపడుతున్న వారు శత్రువులను కలిగి ఉన్నవారు రాహువు యొక్క ప్రభావం వలన విజయాన్ని సాధించగలుగుతారు. పోటీ పరీక్షలలో విజయాన్ని అందుకోగలుగుతారు. కన్యా రాశిలో జన్మించి ఎవరైతే వివాహం కాని వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా కలత్ర స్థానంలో శని భగవానుడు ఉన్న కారణంగా వివాహం ఆలస్యం అవుతుంది. వివాహ జీవితంలో కూడా కొంత ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి. శని సప్తమ స్థానంలో అంటే వివాహ స్థానంలో ఉన్నంతకాలం వివాహ జీవితంలో క్రమశిక్షణను బాధ్యతను గుర్తుచేస్తారు. కాబట్టి మీ జీవిత భాగస్వామి పైన మీరు శ్రద్ధ చూపిస్తేనే వైవాహిక జీవితం అనేది ఆనందదాయకంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది. సంతానపరంగా చూసుకుంటే సంతానం విషయంలో కూడా కొంత ఆలస్యాన్ని సూచిస్తుంది.ఇక విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి రాహువు ఆరవ ఇంట్లో ఉండటం అనేది గొప్ప విజయాన్ని సూచిస్తుంది. Eamcet, neet కానీసాఫ్ట్వేర్ ఎంట్రన్స్ కు సంబంధించిన పరీక్షలకు కానీ రాహువు ఈ రాశివారికి చాలా అనుకూలిస్తున్నాడు.గురువు ఈ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు అనుకూలిస్తున్నాడు. మీ కృషి పట్టుదలతో మంచి ర్యాంకులు సాధించడానికి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. సొంతంగా చేసే వ్యాపారాలలో లాభాలు బాగుంటాయి ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారికి వ్యాపార భాగస్వాములతో విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. జాగర్త వహించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్ధం కన్నా ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశి వారు ప్రతి నిత్యం హనుమాన్ చాలీసా పటించండం, మేధాదక్షిణ మూర్తి రూపు ధరించడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు రుద్ర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన.

తులా రాశి

ఆదాయం – 05, వ్యయం – 14 రాజపూజ్యం – 06, అవమానం – 03

తులా రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పవచ్చు. శని భగవానుడు ఆరవ స్థానంలో ఉన్నాడు. దీనిని రోగస్థానం అని కూడా అంటారు. రాహువు పంచమ స్థానంలో. కేతు పదకొండవ ఇంట్లో ఉన్నాడు. దీనిని లాభ స్థానం అని కూడా అంటారు. గురువు జూన్ రెండవ తేదీ వరకు భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో ఉంటారు. వృత్తి పరంగా, వ్యాపార పరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు జూన్ 2 వ తేది నుండి కొంత ఉపశమనం పొందుతారు, అక్టోబర్ 31వ తేదీ తర్వాత మళ్లీ 11వ స్థానంలోకి వెళ్తాడు. వృత్తి ఉద్యోగంలో మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోండి. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలోఆరోగ్య పరంగా ఆర్థికంగా అనుకూలతలు సూచిస్తున్నాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యమైన గ్రహాల స్థితిగతులను పరిశీలిస్తే శని భగవానుడు ఎప్పుడైతే ఆరవ ఇంట్లో వున్నారో ఆరోగ్య పరంగా ఏవైనా సమస్యలు వచ్చినా శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా అవి ఏవి కూడా మీపై పనిచేయవు ఇబ్బంది పెట్టవు. శని భగవానుడు ఆరవ ఇంట్లో ఉన్నప్పుడు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అది త్వరగా తగ్గిపోతుంది. పాత రుణాలను తీర్చడానికి కూడా కాలం కొంత అనుకూలంగా ఉంటుంది. మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మీలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.

జూన్ రెండవ తేదీన గురువు పదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ స్థానంలో గురువు మిమ్మల్ని ఉన్నత స్థాయికి చేర్చినప్పటికీ పనిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా లాభాలు అధికంగా ఉంటాయి. కేతువు 11వ ఇంటిలో ఉండటం వలన వ్యాపార పరంగా లాభాలు స్థిరంగా ఉంటాయి. ఆర్థిక పరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వివాహం కానీ వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ప్రేమ సంబంధమైన వ్యవహారాలలో కొంత జాగర్త వహించడం అవసరం, మోసపోయే అవకాశం వుంది. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళను సంప్రదించకుండా ముందుకు వెళ్ళకండి. విద్యార్థిని విద్యార్థులకు పంచమంలో రాహువు చదువుపై ఏకాగ్రత లోపిస్తుంది. సోషల్ మీడియా ప్రభావం వలన స్నేహితుల ప్రభావం వలన చదువుపై ఆసక్తి తగ్గే అవకాశం ఉంది. తల్లితండ్రులు పిల్ల చదువుపై దృష్టి పెట్టాలి. విదేశాలు వెళ్ళాలి అనుకునేవారు ద్వితీయార్థంలో వెళ్లే అవకాశాలు వున్నాయి. కస్టపడి చదవండి. ఈ రాశి వారు 16 సోమవారాలు శివాలయంలో అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఇంద్రాణి రూపు మేడలో వేసుకోండి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఏకముఖి రుద్రాక్ష వేసుకోవడం చెప్పడదగినది. అలాగే అంగారక పాశుపత హోమం చేయించడం వలన మంచి ఫలితాలుంటాయి.

వృశ్చిక రాశి

ఆదాయం – 11, వ్యయం – 5 రాజపూజ్యం – 2, అవమానం – 6

వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. సంవత్సర ప్రథమార్థంలో ఖర్చులు అధికంగా ఉంటాయి కావున ఈ రాశి వారు ఖర్చుల విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గురువు అష్టమ స్థానంలో ఉన్నారు. గురువు అష్టమ స్థానంలో ఉండటం మంచిది కాదు. ఆర్థిక పరంగా అప్పులు చేయవలసి రావచ్చు. ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన పెట్టుబడుల విషయాలలో కూడా ఈ రాశి వారు సంవత్సర ప్రథమార్ధం వరకు దూరంగా ఉండటం మంచిది. మధ్యవర్తి సంతకాలకు దూరంగా ఉండటం మంచిది. మీ ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభించడం అనేది ఆలస్యం అవుతుంది. చాయా గ్రహమైన రాహువు మాతృ స్థానంలో వున్నారు కాబట్టి కుటుంబ సభ్యులతో చిన్నచిన్న సమస్యలు అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జూన్ రెండవ తేదీ తర్వాత ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి రుణాలు చాలా వరకు తీర్చగలుగుతారు. ఉద్యోగ పరంగా పదోన్నతి లభిస్తుంది, ట్రాన్స్ఫర్ కోసం నియత్నిస్తున్న వారికి ట్రాన్స్ఫర్ ఉంటుంది. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. శని మీకు అనుకూలంగా ఉండటం వలన శత్రువులు మీపై ప్రభావం చూపలేరు. వ్యాపార పరంగా లాభాలు బాగుంటాయి. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. భాగస్వామి వ్యాపారం అనుకూలిస్తుంది. పొగడ్తలకు దూరంగా ఉండడం చెప్పదగినది.

విద్యాపరంగా చూసుకున్నట్లయితే శని అయిదవ ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యార్థినీ విద్యార్థులకు కష్టపడితేనే ఫలితం అనేది దక్కుతుంది. ఏకాగ్రతను నిలుపుకునే ప్రయత్నాలు చేయాలి. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి జూన్ 2 తర్వాత మంచి అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మికంగా వెళ్తారు. వివాహ పరంగా చూసుకున్నట్లయితే గురువు అష్టమ స్థానంలో జూన్ 1వ తేదీ వరకు ఉంటారు కాబట్టి వివాహ విషయాలు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వివాహం విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా అన్ని చూసుకుని వెళ్లడం అనేది చెప్పదగిన సూచన. గురువు తొమ్మిదవ ఇంటిలోకి మారిన తర్వాత వివాహ పరంగా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మంచి సంబంధం కుదురుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంటుందని చెప్పవచ్చు. ఈ రాశి వారు ప్రతి నిత్యం సుబ్రమణ్య స్తోత్రం పటించండం, సుబ్రమణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన, 11 మంగళవారాలు సుబ్రమణ్య స్వామికి అభిషేకం చేయించడం అలాగే సుబ్రమణ్య స్వామి రూపు ధరించడం చెప్పదగిన సూచన.

ధనస్సు రాశి

ఆదాయం – 14, వ్యయం – 11 రాజపూజ్యం – 5, అవమానం – 6

ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం చాలావరకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యమైన గ్రహాల యొక్క స్థానాలను చూసుకున్నట్లయితే చతుర్థ స్థానంలో వున్నారు. అర్థాష్టమ శనినడుస్తోంది. రాహువు మూడవ ఇంటిలో, కేతువు భాగ్య స్థానంలో. గురువు సప్తమ స్థానంలో వున్నారు. జూన్ రెండవ తారీఖున గురువు అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 31వ తేదీ తర్వాత తొమ్మిదవ స్థానం అనగా భాగ్య స్థానంలోకి ప్రవేశిస్తాడు. ముఖ్య గ్రహాల యొక్క గోచారం ప్రకారంగా ఆరోగ్య పరంగా వ్యక్తిగతంగా శని నాలుగవ ఇంటిలో ఉన్నాడు కాబట్టి మానసిక ఒత్తిడి అనేది కొంతవరకు ఉంటుంది. గత సంవత్సరం ఫలితాలే ఈ సంవత్సరం కూడా కొన్ని పునరావృతం అవుతాయి.

ఈ సంవత్సరం కొన్ని గ్రహాలు యోగిస్తున్నాయి. ఆస్తి తగాదాలు వివాదాలు ఏమైనా ఉన్నట్లయితే ఈ సంవత్సరం కూడా అవి అంత త్వరగా పరిష్కారం కాలేవు. తల్లి గారి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. నూతన గృహం కొనుగోలు చేయడానికి మరియు వాహన యోగం కలగడానికి అక్టోబర్ 31 తర్వాతనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాహువు మూడవ ఇంటిలో ఉండమన్నది శుభ సూచకంగా చెప్పవచ్చు. ధనస్సురాశి వారికి స్త్రీలకైనా పురుషులకైనా ఈ సంవత్సరం ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెరుగుతుంది.మీ శక్తిని మీ తెలివి తేటలను ఉపయోగించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. చేపట్టిన పనులను అన్నింటిని కూడా ఈ సంవత్సరం విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కేతువు తొమ్మిదవ ఇంటిలో ఉన్న కారణంగా ఆధ్యాత్మిక విషయాలపై దైవానుగ్రహం పై నమ్మకం లేని వారు కూడా ఈ సంవత్సరం ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతారు. దైవారాధన ఎక్కువగా చేస్తారు. విహారయాత్రలు, దైవ కార్యక్రమాలకు ఎక్కువగా ఖర్చు చేస్తారు. గురువు జూన్ 2 తేదీన మిధున రాశి నుండి కర్కాటకరాశిలో ప్రవేశిస్తారు. గురువు అష్టమ స్థానంలోకి మారుతారో కొన్నిజాగ్రత్తలు అవసరం అవుతాయి. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఈ సంవత్సరం ప్రథమార్థంలో గురువు సప్తమంలో ఉండడం వలన వివాహ పరంగా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో లేదా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సంవత్సరం శుభకార్యాలు జరుగుతాయి. సంవత్సర ద్వితీయార్థంలో గురువు అష్టమ స్థానంలోకి మారిన తరువాత వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి.

ఈ సంవత్సరం గురువు ధనుస్సు రాశి వారికి అనుకూలిస్తున్నాడు కాబట్టి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అయితే ఉద్యోగంలో అధిక ఒత్తిడి అనేది ఉంటుంది. వివాదాల విషయాలలో, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తప్పని సరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం ప్రథమార్ధంలో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మొత్తం మీద ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పవచ్చు. ఈ ధనస్సు రాశి వారు అర్థాష్టమ శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి అలాగే ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించండి అఘోర పాశుపత హోమం చేయించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు.

మకర రాశి

ఆదాయం – 02, వ్యయం – 08 రాజపూజ్యం – 01, అవమానం – 06

మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలావరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు.ఈ మకర రాశి వారికి ప్రధానమైన గ్రహాల యొక్క స్థానాలను పరిశీలించినట్లయితే ముఖ్యమైన గ్రహం అయినటువంటి శని మూడవ ఇంటిలో అంటే మీన రాశిలో ఉండి చాలా అనుకూలంగా ఉన్నారు. రాహువు ధన స్థానంలో అంటే కుంభ రాశిలో ఉన్నాడు. కేతువు అష్టమ స్థానంలో అంటే ఎనిమిదవ స్థానంలో ఉన్నారు. గురువు జూన్ రెండవ తేదీ వరకు ఆరవ స్థానంలో ఉంటాడు, జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు సప్తమ స్థానంలో వుంటారు. అక్టోబర్ 31 నుండి సంవత్సరం మొత్తం కూడా సింహ రాశిలో అంటే అష్టమ స్థానంలోకి వెళ్తాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారల పరంగా శని మూడవ ఇంటిలో ఉన్నాడు కాబట్టి అద్భుతమైన ఫలితాలను మీరు అందుకోగలుగుతారు. మీ కృషి పట్టుదలకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు. నలుగురిలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు లభిస్తాయి. గురువు ఆరవ ఇంటిలో మొదటి ఆరు నెలలు ఉంటారు కాబట్టి చెల్లించవలసిన చెల్లింపులవిషయంలో ఒత్తిడి అనేది అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి, పోటీ తత్వం కూడా పెరుగుతుంది. గురువు ఏడవ ఇంటిలోకి మారిన తర్వాత వృత్తి పరంగా స్థిరత్వం అనేది లభిస్తుంది కెరియర్ పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి.వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి.

రాహువు ధన స్థానంలో వున్నారు కాబట్టి ఊహించని విధంగా ఘన లాభాలు కలుగుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు లేదా పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. నూతన పెట్టుబడుల విషయంలో రిస్క్ తీసుకోవద్దు. కేతువు అష్టమ స్థానంలో ఉండటం వలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ప్రయాణాల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మూడో ఇంట్లో ఉండటం అనేది కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. శని బలంగా ఉన్నారు కాబట్టి ఏ ఆరోగ్య సమస్య వచ్చినప్పటికీ తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఈ మకర రాశి వారికి వివాహ పరంగా చూసుకున్నట్లయితే గురువు సప్తమంలో వచ్చాక వివాహం జరిగే అవకాశాలు బలంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ ఏడవ స్థానాన్ని కళాత్ర స్థానం అంటారు. ఇది వివాహానికి భాగస్వామ్యానికి సంబంధించినది. శుభప్రదమైన గురువు ఈ స్థానంలో ఉంటారు కాబట్టి శుభకార్యాలు జరగడానికి అవకాశాలు బలంగాఉంటాయి. జూన్ రెండవ తేదీ నుండి అక్టోబర్ 31 వరకు గురువు అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు అనేటివి ఫలిస్తాయి. భార్యభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. విద్యార్థిని విద్యార్థులకు ఈ సంవత్సరం మొదటి ఆరు నెలలు కొంత ఇబ్బందికరమైన వాతావరణంగా చెప్పవచ్చు. జూన్ 2 నుండి గురువు సప్తమంలో ఉండడం, కేతువు అష్టమంలో ఉండడం వలన విద్యా పరంగా పరిశోధనకు సంబంధించిన రంగాలలో మరియు టెక్నికల్ రంగానికి సంబంధించిన చదువులలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ధనం ఖర్చు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారికి కాలం కలసి వస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ రాశి వారు ప్రతి నిత్యం సుబ్రమణ్య స్తోత్రం పఠించండం, సుబ్రమణ్యపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన, 11 మంగళ వారాలు సుబ్రమణ్య స్వామికి అభిషేకం చేయించడం అలాగే సుబ్రమణ్య స్వామి రూపు ధరించడం చెప్పదగిన సూచన.

కుంభ రాశి

ఆదాయం – 02, వ్యయం – 08 రాజపూజ్యం – 04, అవమానం – 02

కుంభరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. గ్రహ స్థితులు పరిశీలిస్తే శని ధన స్థానంలో ఉన్నారు. ఏలినాటి శని నడుస్తోంది. జన్మరాశిలో రాహువు, సప్తమంలో కేతువు వున్నారు. గురువు మొదటి ఆరు నెలలు పంచమస్థానంలో వుంటారు. తరువాత జూన్ నెల రెండవ తేదీ నుండి అక్టోబర్ 31 వరకు ఆరవ స్థానంలో ఉంటాడు. అక్టోబర్ 31 నుండి ఈ సంవత్సరం చివరి వరకు కూడా ఏడవ స్థానంలో అంటే సప్తమ స్థానంలో గురువు ఉంటారు. ఈ ప్రధానమైన గ్రహాల స్థితిగతులను పరిశీలిస్తే రాహువు 1వ ఇంటిలో ఉండటం కేతువు సప్తమ స్థానంలో ఉండటం అనేది అంతా అనుకూలమైనది కాదు. ఇది వివాహ జీవితం పైన ప్రభావం చూపిస్తుంది. రాహువు జన్మరాశిలో ఉన్నందువలన మానసికమైన ఆందోళన గందరగోళం అనేది ఎక్కువ అవుతాయి. వివాహం అయినవారికి కేతువు ఏడవ ఇంటిలో ఉండటం అనేది భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడానికి కూడా కారణం అవుతుంది.

సప్తమ స్థానంలో కేతువు ఉండటం వలన ఈ కుంభ రాశి వారికి వివాహ జీవితం కొంత ఒత్తిడిగా అనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపార్ధాలు కానీ లేదా ఎవరో ఒకరికి ఆరోగ్య పరంగా ఇబ్బందులు గాని ఏర్పడవచ్చు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. సంవత్సర ప్రథమార్థంలో గురు గ్రహ అనుకూలత వల్ల ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు ఆశించిన అభివృద్ధిని సాధించ గలుగుతారు. ఊహించని ధన లాభాలు కలుగుతాయి. గతంలో పెట్టబడులు పెట్టిన వాటి నుండి రాబడి రావడం మొదలవు తుంది. సంవత్సర ద్వితీయార్థం అనగా జూన్ రెండవ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు ఆరవ స్థానంలో అనగా రోగ స్థానంలో ఉంటారు దీని వలన వృత్తి పరంగా పోటీతత్వం పెరుగుతుంది. అక్టోబర్ 31 తర్వాత గురువు ఏడవ ఇంటిలోకి మారుతారు. అంటే సప్తమ స్థానంలో గురు-కేతువులు ఇద్దరు కూడా ఉంటారు సప్తమ స్థానంలోగురు కేతువులు ఇద్దరు ఉండటం వలన గణేశ యోగం అనేది ఏర్పడుతుంది.

సంవత్సర ప్రథమార్థంలో భార్యాభర్తల మధ్య ఏర్పడిన విభేదాలు గురువు సప్తమ స్థానంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం ప్రథమార్థంలో వివాహం అయ్యే అవకాశాలు వున్నాయి. లేదా అక్టోబర్ 31 వ తేదీ తర్వాత ప్రయత్నాలు చేయండి మంచి సంబంధాలు కుదురుతాయి అలాగే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కుంభ రాశి వారు వారికి గురువు ఐదవ స్థానంలో ఉండటం అనేది కలిసి వచ్చే విషయంగా చెప్పవచ్చు సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది.

ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శని మరియు రాహువు వలన ఉద్యోగం వచ్చే అవకాశాలు ఆలస్యం అవుతాయి. ఉద్యోగ పరంగా అనుకున్నంత విజయం దక్కకపోవచ్చు. ఉద్యోగం మారాలి అని అనుకునేవారు మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఉద్యోగం మారకపోవడమే మంచిది. ఈ సంవత్సరం మీకు ముఖ్యంగా సహనం ఓపిక ఆధ్యాత్మిక చింతన అనేది చాలా అవసరం. ఆరోగ్యం పట్ల జాగర్తలు తీసుకోవాలి. ఇతరులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామి వ్యాపారంలో విభేదాలు వచ్చే అవకాశం వుంది. సొంతంగా వ్యాపారం చేసుకునే వారికి బాగుంటుంది అని చెప్పవచ్చు. ఈ కుంభ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కావున 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించి వడమాల సమర్పించండి. ప్రతి రోజు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి, ప్రతి రోజు శని గ్రహ మరియు హనుమాన్ చాలీసా చదవండి ఇలా చేయటం వలన శని గ్రహ అనుకూల ఫలితాలను పొందుతారు.

మీన రాశి

ఆదాయం – 14, వ్యయం – 11 రాజపూజ్యం – 07, అవమానం – 02

మీన రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలిననాటి శని నడుస్తుంది. శని మీ జన్మస్థానంలో ఉన్నాడు. రాహువు కుంభరాశిలో వ్యయ స్థానంలో, కేతువు ఆరవ స్థానంలో అంటే రోగ స్థానంలో ఉన్నాడు. గురువు జూన్ రెండవ తేదీ వరకు నాలుగవ స్థానంలో అంటే మాతృ స్థానంలో ఉంటాడు. జూన్ రెండవ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు పంచమ స్థానంలో ఉంటారు. అక్టోబర్ 31వ తేదీ నుండి సంవత్సరం పూర్తి వరకు కూడా ఆరవ స్థానంలో ఉంటాడు. అంటే రోగస్థానంలో కేతువుతో పాటు కలిసి ఉంటాడు.

ఈ గ్రహ స్థానాలను చూసుకుంటే ముఖ్యంగా ఆరోగ్య పరంగా వ్యక్తి గతంగా జాగర్తలు తీసుకోవాలి, మానసికమైన వత్తిడి ఉంటుంది. ఆరోగ్యం బాగున్నా మానసికమైన ఆలోచనలో ఇబ్బంది పడతారు.మనోధైర్యం ఆత్మవిశ్వాసం తగ్గినట్లుగా అనిపిస్తుంది. అయితే ఈ ఏలినాటి శని జన్మ రాశిలో ఉండడం వలన ఒక రకమైన వైరాగ్యం అనేది ఏర్పడుతుంది. మన అనుకున్నవాళ్ళే మనల్ని మోసం చేశారన్న భాధ ఎక్కువతుంది. మనం పదిమందికి పెట్టేవాళ్ళం కానీ చేయి చాచే వాళ్ళం కాదు కదా అని మదన పడతారు. రాహువు వ్యయ స్థానంలో ఉండటం వలన ఖర్చుల విషయంలో కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. అయితే ఎంత ఖర్చు తగ్గిద్దాము అనుకున్నఖర్చులు అదుపులో వుండవు. దూర ప్రాంత ప్రయాణాలు చేసే వారికి విదేశీ ప్రయాణాలు చేసే వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. కేతువు ఉన్న స్థాన ప్రభావం వలన శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు సంబంధమైన విషయాలలో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. జన్మరాశిలో శని సంచారం వలన ఎముకలకు సంబంధించిన ఇబ్బందులు దంతాలకు సంబంధించిన ఇబ్బందుల విషయాలలో జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. సంవత్సర ద్వితీయార్థంలో గురువు పంచమ స్థానంలో ఉండటం వల్ల అలాగే వృత్తి వ్యాపారాల పరంగా శని గ్రహ ప్రభావం వలన కాస్త ఒత్తిడి అనేది ఉంటుంది. కొన్ని బాధ్యతలు అదనంగా మీపై పడతాయి. ఫలితాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ మీకు కష్టానికి తగిన గుర్తింపు మాత్రం లభిస్తుంది. అనుకూలమైన గురు గ్రహం వలన స్థిరత్వం ఏర్పరుచుకో గలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది, గృహ, వాహనయోగం కలుగుతుంది.

రాహువు 12 ఇంటిలో ఉన్నప్పటికీ గురు బలం బాగుంది కాబట్టి ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. ఊహించని ధన లాభాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. జీవిత ఆశయం నెరవేరుతుంది. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. ఏదైనా నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే పెట్టవచ్చు, కాలం అనుకూలంగా ఉంది. కొన్ని అప్పులు తీరుస్తారు. వైవాహిక జీవితంలో ఓపిక సహనం అనేది భార్యాభర్తలు ఇద్దరికీ చాలా అవసరం. మీన రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం తప్పక చేయించండి ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించండి అలాగే వడమాల సమర్పించండి. అన్ని విధాలుగా బాగుండడానికి అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవడం కానీ వినడం చేయండి అనుకూలమైన ఫలితాలను పొందండి. విద్యార్థినీ విద్యార్థులకు కష్టపడితేనే ఫలితం అనేది దక్కుతుంది. ఏకాగ్రతను నిలుపుకునే ప్రయత్నాలు చేయాలి. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి జూన్ 2 తర్వాత మంచి అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మికంగా వెళ్తారు.