Reading Time: 2 minutes

గర్వంతో ఎగిరిపడే వాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పారు

పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలయితే బిఆర్‌ఎస్ సత్తా తెలిసొచ్చేది

బిఆర్‌ఎస్‌ఎల్‌పి, కార్యవర్గ సమావేశంలో కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : తనను దూషించడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కె.చంద్రశేఖర్‌రావు అసహనం వ్యక్తం చేశారు. తాను చనిపోవాలని శాపాలు పెట్టడమే వారి విధానంగా అర్థమవుతుందని ఆక్షేపించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం పార్టీ అధినేత కెసిఆర్ అధ్యక్షతన బిఆర్‌ఎస్‌ఎల్‌పి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరిగింది. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో నదీ జలాలు, ప్రాజెక్టులకు సంబంధించి ఉద్యమ కార్యాచరణ, రాష్ట్రంలో రైతుల సమస్యలు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించిందన్నారు. కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందని అన్నారు.

బిఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారుల గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే బిఆర్‌ఎస్ సత్తా ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసేదని పేర్కొన్నారు. గర్వంతో ఎగిరే కొంతమంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. ఉమ్మడి ఎపి మాజీ సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని బిఆర్‌ఎస్ హాయాంలో అసెంబ్లీ వేదికగా ప్రశంసించామని గుర్తుచేశారు. ఆరోగ్య శ్రీ మొత్తాన్ని రూ. 2 లక్షలు ఉంటే రూ.5 లక్షలకు పెంచామని చెప్పారు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది..? అని ప్రశ్నించారు. కెసిఆర్ కిట్ లాంటి పథకాలను కూడా నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజల ఆస్తుల విలువ తగ్గింది

బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాము ఎక్కడా అహంకార వైఖరి ప్రదర్శించలేదని కెసిఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్క పాలసీని కూడా తేలేదని విమర్శించారు. హిల్ట్ పాలసీని మాత్రం రియల్ ఎస్టేట్ కోసమే తీసుకువచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు యూరియా రైతుల ఇంటికి, చేను వద్దకు వచ్చేదని, ఇప్పుడు ఏకంగా యూరియా కోసం కుటుంబమంతా లైన్‌లో నిలబడే దారుణమైన పరిస్థితి నెలకొందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించకపోగా, ఉన్న వాటిని ఆపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చెక్ డ్యామ్‌లు పేల్చివేయడం దారుణం

రాష్ట్రంలో బస్తీ దవాఖానాలను నిర్వీర్యం చేస్తున్నారని కెసిఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రాచి రంపాన పెడుతోందని ధ్వజమెత్తారు. రైతులకు నీళ్లు ఇచ్చే చెక్ డ్యామ్‌లను పేల్చివేయడం దారుణమని, మళ్లీ బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక కూల్చినవాళ్లు పాతాళంలో ఉన్నా పట్టుకొచ్చి శిక్షిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో పాలమూరు, నల్గొండ జిల్లాలను అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పారు. 90 శాతం పనులు పూర్తయిన పాలమూరు- రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టును ప్రభుత్వ పెద్దలు ఎందుకు పడావు పెట్టారు..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేవలం 10 శాతం పనులను ఎందుకు పూర్తి చేయడం లేదని నిలదీశారు.

హాజరైన బిఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు

బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అధ్యక్షతన జరిగిన బిఆర్‌ఎస్‌ఎల్‌పి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, జగదీష్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, మాజీ రాజ్యసభ ఎంపీలు సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు.