Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్ : స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో డాక్టర్‌ను బురిడీ కొట్టించి రూ.14 కోట్లు స్వాహా చేసిన సంఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. హైదరాబాద్‌కు చెందిన ఒక డాక్టర్ నుంచి ఈ కిలేడి ఏకంగా రూ.14 కోట్లు కొట్టేసింది. తొలుత సైబర్ నేరగాళ్లు అందమైన అమ్మాయి ఫోటోలతో డాక్టర్ని బుట్టలో వేసుకున్నారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన కిలేడి చెలరేగి పోయింది.. తాను ఒక ఒంటరి మహిళని, స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన కంపెనీలో పని చేస్తానని డాక్టర్‌కు పరిచయం చేసుకుంది. ఈ క్రమంలో డాక్టర్‌కు స్టాక్ మార్కెట్లో తమ కంపెనీ ద్వారా పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించింది. దీంతో అత్యాశతో సదరు డాక్టర్ కిలేడీని నమ్ముకుని సొంత ఇల్లును అమ్మి రూ.14 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఆ డాక్టర్ పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ కిలేడి ముఠా ప్లేటు ఫిరాయించింది. దీంతో మోసపోయానని గుర్తించిన డాక్టర్ సైబర్ క్రైమ్ పోలీసు లకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు డాక్టర్ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎసిపి ప్రసాద్ మాట్లాడుతూ మోసపోయిన డాక్టర్‌ను సైబర్ కేటుగాళ్లు కంబోడియా నుంచి ట్రాప్ చేసి మోసం చేసినట్లు వెల్లడించారు. కంబోడియాలో తిష్ట వేసిన చైనా దేశస్థులు ఈ వ్యవహారం వెనకాల ఉన్నారని చెప్పారు. ఇండియా నుంచి ఉద్యోగాల పేరుతో యువకుల్ని తీసుకువెళ్లి బలవంతంగా సైబర్ నేరా లు చేయిస్తున్నారని వెల్లడించారు. చైనీయులు మన దేశం వాళ్లతోనే ఇక్కడ సైబర్ నేరాలు చేయిస్తున్నారన్నారు. ఈ కేసు విచారణలో కంబోడియాలో ఉన్న సైబర్ నేరగాలకు మ్యూల్ అకౌంట్స్ అందించిన నలుగురిని అరెస్టు చేశామన్నారు. నిందితులు మ్యూల్ అకౌంట్‌లోకి వచ్చిన డబ్బుల్ని వివిధ మార్గాల ద్వారా కాంబోడియాకి తరలించినట్లు గుర్తించినట్లు వెల్లడించారు.