Reading Time: < 1 minute

ఉద్యోగులు, జర్నలిస్టులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా ఇజెహెచ్‌ఎస్ (ఎంప్లాయీస్, జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్) వెల్‌నెస్ సెంటర్లలో సేవలను విస్తరించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. వెల్‌నెస్ సెంటర్లలో కార్డియాలజీ, నెఫ్రాలజీ తదితర స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై మంత్రి శుక్రవారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఆరోగ్యశ్రీ సిఇఒ ఉదయ్‌కుమార్, డిఎంఇ నరేంద్ర కుమార్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వెల్‌సెట్ సెంటర్లలో ఇకపై జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, పీడియాట్రిక్స్, న్యూరాలజీ, డెర్మటాలజీ వంటి స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను కూడా దశలవారీగా అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఆయా స్పెషాలిటీలకు సంబంధించిన డాక్టర్లను, సిబ్బందిని వెల్‌నెస్ సెంటర్లలో నియమించడంతో పాటు, పేషెంట్లకు టెస్టులు చేసేందుకు అవసరమైన పరికరాలను కూడా ఏర్పాటు చేయాలని తెలిపారు. సెంటర్లలో పేషెంట్లకు అవసరమైన వెయిటింగ్ ఏరియా, ఇతర సౌకర్యాలను మెరుగుపర్చాలని సూచించారు. వెల్‌నెస్ సెంటర్లలో మెడిసిన్స్ అందుబాటులో లేవంటూ ఉద్యోగులు, జర్నలిస్టుల నుంచి ఫిర్యాదులు వచ్చే పరిస్థితి ఉండకూడదన్నారు. అవసరమైన అన్నిరకాల మెడిసిన్స్‌ను అన్ని వెల్‌నెస్ సెంటర్లలో సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. మెడిసిన్ ఇండెంట్ నుంచి కొనుగోలు వరకూ పూర్తి ప్రక్రియ డిజిటల్‌గానే జరగాలని మంత్రి ఆదేశించారు. కొనుగోలు, సరఫరాలో జాప్యం ఉండకూడదని పేర్కొన్నారు.ఆన్‌లైన్‌లో ఒపి బుక్ చేసుకునేందుకు వీలుగా యాప్‌ను సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఇజెహెచ్‌ఎస్ పరిధిలోని జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య సేవలు అందించేందుకు

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 12 వెల్‌నెస్ సెంటర్లను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిర్వహిస్తోంది. సేవల విస్తరణ ప్రణాళికలో భాగంగా.. ఖైరతాబాద్, కూకట్‌పల్లి వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణ బాధ్యతలను నిమ్స్‌కు, మిగిలిన 10 వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణ బాధ్యతలను మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మెడిసిన్, డెంటల్, ఫిజియోథెరపీ వంటి సేవలను వెల్‌నెస్ సెంటర్లు అందిస్తున్నాయి. కొన్నిచోట్ల గైనకాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ సేవలు అందుతున్నాయి.