
భారత పర్యటనలో భాగంగా శనివారం అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి హైదరాబాద్ కు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. కొద్దిసేపటిక్రితమే మెస్సి అక్కడి నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు. ప్యాలెస్ లో 100 మందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇప్పటికే ఆయనను కలిసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సిఎం రేవంత్ కూడా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం మెస్సి ఉప్పల్ స్టేడియానికి బయల్దేరి వెళ్లనున్నారు. మెస్సి ఫుట్ బాల్ మ్యాచ్ నేపథ్యంలో స్టేడియం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
కాగా, అంతకుముందు ఇవాళ ఉదయం కోల్‌కతాలో మెస్సి పర్యటించారు. సాల్ట్ లేక్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈవెంట్ కు వెళ్లిన మెస్సికి నిర్వాహణ లోపం తలెత్తడంతో ఆయన కేవలం పది నిమిషాలు మాత్రమే ఉండి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహానికి గురైన అభిమానులు స్టేడియంలోని కుర్చీలు, టెంట్లు ధ్వంసం చేశారు. ఈ గందరగోళ పరిస్థితులకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే మెస్సికి, అభిమానులకు క్షమాపణ చెప్పి.. విచారణకు ఆదేశించారు. కోల్ కతాలో గందరగోళ పరిస్థితుల చోటుచేసుకోవడంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.