Reading Time: < 1 minute

హైదరాబాద్: కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులలో పంపులు, మోటార్లు పాడయ్యేలా కావాలనే కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆ నెపాన్ని గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు.  ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదే పదే ఆన్, ఆఫ్ చేస్తూ అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలా చేస్తే వైబ్రేషన్స్ వచ్చి పంపులు, ఇంప్లర్స్, మోటార్లు పాడైపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇది ప్రభుత్వ పాలనాపరమైన నిర్లక్ష్యమా? లేక కావాలనే చేస్తున్న కుట్రనా? అని ప్రశ్నించారు. భారీ మోటార్లు నిరంతరాయంగా నడిచేలా డిజైన్ చేసినవని, పదే పదే ఆపితే తీవ్ర నష్టం తప్పదని,  వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టులను ఇలా నిర్లక్ష్యంగా వాడటం శోచనీయం కాదని హరీష్ రావు సూచించారు. చందలాపూర్ సహా ప్యాకేజీ 6, 8, 10, 11, 12 లలో మోటార్ల ఆపరేషన్ తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని, తక్షణమే మోటార్లను పదే పదే ఆన్, ఆఫ్ చేసే అశాస్త్రీయ విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలని, మీ రాజకీయాల కోసం తెలంగాణ రైతుల జీవనాడి అయిన ప్రాజెక్టులతో చెలగాటం ఆడొద్దని హెచ్చరించారు.