Reading Time: < 1 minute

కేర‌ళ‌: పిన‌రాయి విజ‌య‌న్ వైదొలిగే స‌మ‌యం ఆస‌న్న‌మైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం కోవ‌లం యూడీఎఫ్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో సిఎం రేవంత్ మాట్లాడుతూ.. కేర‌ళంలో పంచాయ‌తీరాజ్ వ్య‌వ‌స్థ విజ‌యం సాధించిందని.. దానిని అభినందిస్తున్నామని అన్నారు. కేరళంలో పంచాయ‌తీరాజ్ వ్య‌వ‌స్థ ఘ‌న‌త కాంగ్రెస్ ముఖ్య‌మంత్రులు క‌రుణాక‌ర‌న్‌, ఊమెన్ చాందీల‌ది అని చెప్పారు. ఎక్క‌డైనా మంచి జ‌రిగితే తాము అభినందిస్తామన్నారు. పిన‌రాయి విజ‌య‌న్ హ‌యాం ముగిసిందని..120 నెల‌ల విజ‌య‌న్ పాల‌న కాలం వైఫ‌ల్యానికి ప్ర‌తీక‌గా నిలిచిందని సిఎం రేవంత్ విమర్శించారు.

“మూడింట రెండొంతుల మెజారిటీతో మేం గెల‌వ‌బోతున్నాం.. ఊమెన్‌చాందీ త‌ర‌హా పాల‌న అందిస్తాం. కేర‌ళంలో స‌రైన అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో యువ‌త ఉపాధి కోసం విదేశాలకు వెళ్లారు. యువ‌త వ‌ల‌స వెళ్ల‌డంతో కేర‌ళంలో వృద్ధులు… చిన్నపిల్ల‌లే కనిపిస్తున్నారు.ఇది దుర‌దృష్ట‌క‌రం. పిన‌రాయి విజ‌య‌న్‌తో పాటు కేర‌ళం క‌మ్యూనిస్టు మ‌హిళా నాయ‌కుల‌ను నేను తెలంగాణ‌కు ఆహ్వానిస్తున్నా.. వారికి అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు మేం చేస్తాం. తెలంగాణ‌లోని ఏ మూల‌కైనా వెళ్లి మేం అమ‌లు చేస్తున్న సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను వారు ప‌రిశీలించ‌వ‌చ్చు… ఈ విష‌యంలో నేను విజ‌య‌న్‌కు స‌వాల్ విసురుతున్నా. మేం 67 వేల ఉద్యోగాలు ఇచ్చాం… 25 ల‌క్ష‌ల రైతు కుటుంబాలకు చెందిన‌ రూ. 20,670 కోట్ల రుణ‌మాఫీ చేశాం. 4 ల‌క్ష‌ల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం.. 200 యూనిట్లు లోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.. రూ.500కే గ్యాస్ సిలిండ‌ర్ స‌ర‌ఫ‌రా చేస్తున్నాం. మేం హామీలన్నీ అమ‌లు చేస్తున్నాం… విజ‌య‌న్ తెలంగాణ‌కు వ‌చ్చి అన్నీ ప‌రిశీలించుకోవ‌చ్చు. ఎన్నిక‌లు కేర‌ళం.. తెలంగాణ మ‌ధ్య కాదు యూడీఎఫ్‌.. ఎల్డీఎఫ్ మ‌ధ్య జ‌రుగుతున్నాయి. మేం ఏం చేస్తున్నామో అది చెబుతున్నాం.. మా స‌వాళ్ల‌కు విజ‌య‌న్ స‌మాధానం ఇవ్వాలి” అని సిఎం రేవంత్ పేర్కొన్నారు.