
బిఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఇతర నేతల అరెస్టులపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూమిని కాపాడుకోవాలని పోరాడుతున్న రైతులకు బాసటగా నిలిచేందుకు వెళ్తున్న మాజీ మంత్రి హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పార్టీ నేతలు మహేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి,మెతుకు ఆనంద్, ఇతర నేతలను అక్రమంగా గృహనిర్బంధం చేయడం, అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పిరికిపంద చర్య అని పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతులను పోలీసుల బలంతో నొక్కాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని మండిపడ్డారు. పరిగి నియోజకవర్గంలోని కాడ్లాపూర్, రాపోలు గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రైతుల నుండి 1200 ఎకరాల భూమిని బలవంతంగా లాక్కోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలీ పేదల భూముల పైన పడిందని ఆరోపించారు. రైతు భరోసా, రుణమాఫీ,
ఆరు గ్యారంటీలు 420 హామీలను అమలు చేయకుండా రైతులను అరిగోస పెడుతున్న ప్రభుత్వం, ఇప్పుడు పరిశ్రమల పేరుతో భూ సేకరణకు దిగడం దుర్మార్గమని పేర్కొన్నారు. గత రెండున్నరేళ్లలో ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాని ఈ సర్కార్, భూములను దోచుకోవడంలో మాత్రం విపరీతమైన ఆసక్తి చూపిస్తోందని, కాంగ్రెస్ నేతలు దొంగల్లా ఊళ్లు పంచుకుంటున్నట్లు భూములను కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులు, జైళ్లు, అక్రమ కేసులు బిఆర్‌ఎస్ నాయకులకు కొత్త కాదు అని, ఉద్యమ కాలం నుండే ఇవన్నీ ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడ్డామని అన్నారు. ప్రభుత్వం తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు ఎవరూ భయపడేది లేదని, ప్రజల పక్షాన పోరాటం ఆగదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం ఎంత అణచివేతకు పాల్పడినా, బాధితులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. అక్రమంగా నిర్బంధించిన నాయకులను వెంటనే విడుదల చేయాలని, భూ సేకరణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.