Reading Time: < 1 minute

ఉప ఎన్నిక సందర్భంగా తనపై నమోదయిన కేసులు కొట్టేయాలని కోరుతూ సిఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎన్నికల అధికారుల ఫిర్యాదుతో పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేశారు. హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని నేరేడు చర్ల, మఠంపల్లి, పాలకీడు, హుజూర్‌నగర్ పోలీస్ స్టేషన్లలో రేవంత్ రెడ్డిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇవి ప్రస్తుతం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతున్నాయి. ఈ క్రమంలో తనపై నమోదయిన కేసులు కొట్టివేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం ఫిర్యాదు చేసిన ఎన్నికల అధికారులకు, కేసు నమోదు చేసిన పోలీసులకు నోటీసులు జారీ చేసింది. పిటిషన్ విచారణను ఈ నెల 21వ తేదీన చేపడతామని ధర్మాసనం పేర్కొంది.