Reading Time: < 1 minute

తమిళనాడు రాష్ట్ర ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ క్యాంపెనియర్లుగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, రాష్ట్ర మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ మంగళవారం నలభై మందితో జాబితాను విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేరళ రాష్ట్రానికి ఎన్నికల స్టార్ క్యాంపెనియర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రచారం వల్ల పార్టీకి మేలు జరిగిందని అధిష్టానం విశ్వసిస్తున్నది. కేరళలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, తాము చేపట్టిన పథకాలను తెలుసుకోవడానికి తమ రాష్ట్రాన్ని

సందర్శించాల్సిందిగా రేవంత్ రెడ్డి కేరళ ప్రచారంలో ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కాబట్టి తమిళనాడులో కూడా ప్రచారం చేయిస్తే పార్టీకి మరింత మేలు జరుగుతుందని, తెలుగు ప్రభావిత ప్రాంతాల్లో ప్రచారం చేయించాలని పార్టీ నాయకత్వం భావించి స్టార్ క్యాంపెనియర్‌గా నియమించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో కూడా తెలుగు ప్రభావిత ప్రాంతాల్లో ప్రచారం చేయించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు సీనియర్ అబ్జర్వర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. తమిళనాడు రాష్ట్రానికి ఈ నెల 23న జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిఎంకెతో కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.