Reading Time: < 1 minute

టెహ్రాన్: ఇరాన్ కు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో పశ్చిమ ఆసియాలో ఘర్షణ పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం.. భారత పౌరులకు కీలక సూచనలు చేసింది. భారతీయులు రాబోయే 48 గంటల పాటు ఇళ్లలోనే ఉండాలని తెలిపింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో ఇరాన్ లోని విద్యుత్ కేంద్రాలు, సైనిక స్థావరాలు, బహుళ అంతస్తుల భవనాల పై అంతస్తులకు దూరంగా ఉండాలని రాయబార కార్యాలయం పౌరులను హెచ్చరించింది.

“గతంలో ఇచ్చిన సలహాలకు కొనసాగింపుగా, ఇప్పటికీ ఇరాన్‌లో ఉన్న భారత పౌరులు రాబోయే 48 గంటల పాటు వారు ఉన్నచోటనే ఉండాలి. అన్ని విద్యుత్, సైనిక స్థావరాలు, బహుళ అంతస్తుల భవనాల పై అంతస్తులకు దూరంగా ఉంటూ, ఇళ్లలోనే ఉండాలి. రహదారులపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలి” అని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.

రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన వసతి గృహాలలో ఉంటున్న భారతీయులు తమ గదులను విడిచి వెళ్లవద్దని, ఆ హోటళ్లలో ఉన్న రాయబార కార్యాలయ బృందాలతో నిరంతరం సంప్రదింపులు జరపాలని సూచించారు. భారత పౌరులందరూ అధికారిక ప్రకటనలను నిశితంగా గమనించాలని.. సూచనలను ఆలస్యం చేయకుండా పాటించాలని కూడా రాయబార కార్యాలయం చెప్పింది.