
అమరావతి: ఓ బాలుడు ఏడుస్తూ గ్రామానికి వచ్చి తన తండ్రిని రాళ్లతో కొట్టి చంపేశారని చెప్పడంతో గ్రామస్థులు అక్కడికి వెళ్లి చూడగా ఓ మృతదేహం రక్తపు మడుగులో కనిపించింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తమిళనాడు రాష్ట్రానికి చెందిన గాంధీ(45), రాసాతి అనే దంపతులు చౌడేపల్లి మండలంలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు సందీప్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. రాసాతికి నరిసింహులు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమె భర్త, కుమారుడిని వదిలేసి ప్రియుడితో పారిపోయింది. వారు బోయకొండ యానాదిపాళ్యంలో ఉన్నట్లు తెలియడంతో గాంధీ తన కుమారుడితో కలిసి వారు వద్దకు వెళ్లాడు. భార్య నీ వెంట పంపిస్తామని గాంధీకి కొందరు నమ్మబలికారు. గాంధీ, అతడి కుమారుడిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అతడిని రాళ్లతో కొట్టి చంపారు. చీకటి కావడంతో తండ్రి మృతదేహం వద్దే కుమారుడు ఉండిపోయాడు. తెల్లవారుజామున మృతదేహం నుంచి రెండు కిలో మీటర్లు నడిచి గ్రామానికి చేరుకొని తన తండ్రిని చంపేశారని చెప్పాడు. గ్రామస్థులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని గుర్తించారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.