Reading Time: < 1 minute

మన తెలంగాణ/క్రీడా విభాగం: ఐపిఎల్ సీజన్ 2026లో పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) టీమ్ వరుస ఓటములతో నిరాశ పరుస్తోంది. చెన్నై ఇప్పటికే హ్యాట్రిక్ పరాజయాలను చవిచూసింది.బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి పాలు కావడంతో అభిమానులు నిరాకు గురవుతున్నారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ జట్టును విజయపథంలో నడిపించడంలో విఫలమవుతున్నాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అతని కెప్టెన్సీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆర్‌సిబి బ్యాటర్లు చెలరేగిపోతున్నా రుతురాజ్ పెద్దగా స్పందించలేదు. ఫీల్డింగ్, బౌలింగ్‌లో మార్పులు చేయడంలో విఫలం కావడంతో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు.

ముఖ్యంగా టిమ్ డేవిడ్ విధ్వంసక బ్యాటింగ్‌తో చెన్నై బౌలింగ్‌ను చిన్నాభిన్నం చేశాడు. అతన్ని ఎలా కట్టడి చేయాలో తెలియక బౌలర్లు పూర్తిగా చతికిల పడిపోయారు. అంతకుముందు జరిగిన తొలి రెండు మ్యాచుల్లో కూడా చెన్నైకి పరాజయాలు తప్పలేదు. వరుస ఓటములు ఎదురవుతున్నా లోపాలను సరిదిద్దు కోవడంలో కెప్టెన్‌తో పాటు ఇతర ఆటగాళ్లు ఘోర వైఫల్యం చవిచూస్తున్నారు. ఇప్పటికే మూడు మ్యాచుల్లో ఓటమి పాలు కావడంతో కెప్టెన్‌తో పాటు, జట్టు సభ్యులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రుతురాజ్ బ్యాట్‌తోనే కాకుండా కెప్టెన్సీలోనూ తేలిపోతున్నాడు.

అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. ఇక భారీ ఆశలు పెట్టుకున్న స్టార్ ఆటగాడు సంజు శాంసన్ కూడా వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. మూడు మ్యాచుల్లోనూ శాంసన్ విఫలమయ్యాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా జట్టుకు అండగా నిలువలేక పోయాడు. పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. అయూష్ మాత్రె, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబె, ఓవర్టన్, మ్యాట్ హెన్రీ, నూర్ అహ్మద్ వంటి స్టార్‌లు జట్టులో ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. రానున్న మ్యాచుల్లోనైనా చెన్నై తన ఆట తీరును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టంగా మారడం ఖాయం.