
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్‌కు అరుదైన ఆహ్వానం లభించింది. బెంగళూరు వేదికగా అత్యంత వైభవంగా జరగనున్న ‘’ఎంటర్‌ప్రెన్యూర్ ఇండియా ఐడియా అవార్డ్స్ 2026” వేడుకకు ఆయనను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. నవ కల్పనలు, పారిశ్రామిక వృద్ధికి ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. వచ్చే ఏప్రిల్ 16వ తేదీన బెంగళూరు వైట్‌ఫీల్డ్‌ని షెరటన్ గ్రాండ్ హోటల్‌లో ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మెగా ఈవెంట్‌లో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 300 మందికి పైగా అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు, అంకుర సంస్థల (స్టార్టప్) వ్యవస్థాపకులు, వ్యాపార రంగ నిపుణులు ఒకే వేదిక పైకి రానున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న దార్శనిక నాయకులను ఈ సందర్భంగా సత్కరించనున్నారు.
సాంకేతికత, ఆవిష్క రణలు, ఆర్థికాభివృద్ధి రంగాల్లో కెటిఆర్ చూపిన డైనమిక్ నాయకత్వాన్ని నిర్వాహకులు ఈ సందర్భంగా కొనియాడారు. తెలంగాణ ఐటి, పరిశ్ర మల శాఖ మంత్రిగా ఆయన హయాంలో తీసుకువచ్చిన ప్రగతిశీల విధానాలు, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి దేశవ్యాప్తం గా ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిచ్చాయని ఆహ్వాన పత్రంలో పేర్కొన్నారు. ఈ సదస్సును ఉద్దేశించి కెటిఆర్ ప్రసంగించాలని, ఆయన మాటలు భావి పారిశ్రామికవేత్తల్లో నూతనోత్సాహాన్ని నింపుతాయని నిర్వాహక ప్రతినిధులు కోరారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణను ఇన్నోవేషన్ హబ్‌గా మార్చడంలో కెటిఆర్ పోషించిన కీలక పాత్రకు, పారిశ్రామిక రంగంలో ఆయన చేసిన కృషి నేపధ్యంలో ఈ ఆహ్వానం దక్కింది.