
ఓ వ్యక్తికి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలో భాగంగా అవసరమయిన ఊపిరితిత్తులను అత్యవసరం పరిస్థితుల్లో సోమవారం బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌కు తీసుకొచ్చారు. దీని కోసం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి రవాణాకు ఎటువంటి అవాంతరాలు లేకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమయిన చర్యలు తీసుకుంది. రవాణా కోసం ఎయిర్ అంబులెన్స్‌లో ప్రత్యేక వైద్య బృందం ఊపిరితిత్తులతో బెంగళూరు నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని కిమ్స్ వైద్యశాలకు ఊపిరితిత్తులను తరలించారు.
అయితే ఉపిరితిత్తులను తరలిచేందుకు ప్రత్యేకమయిన అంబులెన్స్ ఏర్పాటు చేయడంతో పోలీసులు శంషాబాద్ విమనాశ్రయం నుంచి కిమ్స్ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో గ్రీన్ చానల్‌ను ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి వెళ్లే ప్రయాణ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టడంతో కేవలం 25 నిమిషాల్లోనే శంషాబాద్ విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్ కిమ్స్ వైద్యశాలకు ఊపిరితిత్తులు సురక్షితంగా చేరుకున్నాయి.