
బిగ్‌బాస్ తెలుగు సీజన్-9తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని రన్నరప్‌గా నిలిచిన తనూజ ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలో సరికొత్త ప్రయాణానికి సిద్ధమైంది. టెలివిజన్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. తనూజ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘పార్ట్ టైమర్స్’ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
వెబ్ సిరీస్ లోకి ఎంట్రీ..
యూత్‌ను టార్గెట్ చేస్తూ రూపొందిన ఈ ఆసక్తికరమైన సిరీస్ ఆగస్టు 28 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ప్రకటనతోనే సోషల్ మీడియాలో సిరీస్‌పై మంచి బజ్ క్రియేట్ అయింది. లేటెస్ట్ గా విడుదలైన ప్రోమో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని మరింత పెంచేసింది. ఈ సిరీస్‌లో తనూజతో పాటు టాలెంటెడ్ నటి జ్ఞానేశ్వరి కాండ్రేగుల కీలక పాత్రలో కనిపించనుంది.
కథేంటంటే?
ఈ సిరీస్ 30 ఏళ్లలోపు బిజినెస్‌లో పెద్ద సక్సెస్ సాధించాలని కలలు కనే ఇద్దరు యువతుల జీవితాల చుట్టూ కథ తిరుగుతుందని ఈ ప్రోమోను బట్టి అర్థమవుతోంది. తమ లక్ష్యాల కోసం వారు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? విజయానికి చేరుకునే ప్రయాణంలో ఎలాంటి ట్విస్టులు ఎదురయ్యాయి? అనే అంశాలను వినోదాత్మకంగా, ఎమోషనల్‌గా చూపించనున్నట్లు తెలుస్తోంది.
కెరీర్, డ్రీమ్స్, ఫ్రెండ్‌షిప్, స్ట్రగుల్, ఎంటర్‌టైన్‌మెంట్‌ను మేళవించిన ఈ వెబ్ సిరీస్ యువతకు బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బిగ్‌బాస్ తర్వాత తనూజ నటిగా ఈ వెబ్ సిరీస్ తో మరో మెట్టు ఎక్కుతుందా? ‘పార్ట్ టైమర్స్’తో ఓటీటీలో కూడా తన సత్తా చాటుతుందా? అన్న ఆసక్తి ఇప్పుడు సినీ అభిమానుల్లో నెలకొంది. ఆగస్టు 28న జియో హాట్‌స్టార్‌లో ఈ కొత్త ప్రయాణం ఎలా ఉండబోతోందో చూడాలి.