Reading Time: < 1 minute
Viral Video: క్లాస్‌రూమ్‌లోకి దూరిన భారీ జెర్రిపోతు.. విద్యార్థులు తెలివిగా ఏం చేశారో తెలిస్తే..

ఓ భారీ జెర్రిపోతు క్లాస్‌రూమ్‌లోకి దూరి పాఠాలు వింటున్న విద్యార్థులను భయాందోళనకు గురిచేసిన ఘటన మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. నాసర్‌రెడ్డి నగర్‌లోని ఎంపీపీ స్కూల్‌లో ఉపాధ్యాయుడు పిల్లలకు పాఠాలు చెబుతుండగా, ఒక భారీ జెర్రిపోతు చప్పుడు కాకుండా క్లాస్‌రూమ్‌లోకి దూరింది. అప్పటివరకు చక్కగా పాఠాలు వింటున్న విద్యార్థులు ఆ పామును చూసి ఒక్కసారిగా భయపడిపోయారు. క్లాస్‌రూమ్ నుంచి బయటకు పరుగులు తీశారు.

విద్యార్థుల అరుపులు విని భయపడిపోయిన ఆ జెర్రిపోతు సైతం క్లాస్‌రూమ్‌లోని ఓ బెంచ్ కిందకు దూరి నక్కింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు స్థానికంగా ఉండే ప్రైవేటు స్నేక్ క్యాచర్ మల్లికార్జునకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పామును పట్టుకునేందుకు రంగంలోకి దిగాడు. చాలాసేపు శ్రమించి, బెంచ్ చాటున నక్కిన ఐదు అడుగుల పొడవున్న పామును సురక్షితంగా పట్టుకున్నాడు. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.

అనంతరం స్నేక్ క్యాచర్ ఆ పామును విద్యార్థులకు చూపిస్తూ దానిపై అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణకు పాములు ఏవిధంగా దోహదపడతాయో విద్యార్థులకు వివరించాడు. ఆ తర్వాత పామును సురక్షితంగా మైదాన ప్రాంతంలో వదిలివేస్తానని తెలిపాడు. జనావాసాల మధ్యకు పాములు వస్తే వాటిని చంపకుండా తనకు సమాచారం అందిస్తే, పట్టుకుని సురక్షితంగా మైదాన ప్రాంతాల్లో వదిలేస్తానని స్నేక్ క్యాచర్ మల్లికార్జున తెలిపాడు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.