
హైదరాబాద్ లోని చందానగర్ లో ఘోరం జరిగింది. అపార్ట్మెంట్ లిఫ్ట్ లో ఇరుక్కొని తీవ్ర గాయాలతో మహిళ మృతి చెందింది. మంగళవారం ( ఆగస్టు 4 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి… చందానగర్ లోని అన్నపూర్ణ ఎన్ క్లేవ్ అపార్ట్మెంట్ లో లిఫ్ట్ ఎక్కింది ఓ మహిళ. లిఫ్ట్ లో అడుగుపెట్టగానే కదలడంతో ఆమె కాళ్ళు లిఫ్ట్ లో ఇరుక్కొని తీవ్ర గాయాలయ్యాయి.
తీవ్ర గాయాలైన మహిళను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అయితే.. ఆమె అప్పటికే మరణించినట్లు నిర్దారించారు డాక్టర్లు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లిఫ్ట్ ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.
అపార్ట్మెంట్స్ లో లిఫ్టులు ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించాలని.. యాజమాన్యాలు, కమిటీలదే ఈ బాధ్యత అని అంటున్నారు పోలీసులు. నిర్లక్ష్యం వహిస్తే అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని అంటున్నారు పోలీసులు.