Reading Time: 2 minutes

జనన, మరణ నమోదు (సవరణ) బిల్లు 2026 కు రాజ్యసభ ఆమోదం.. కీలక మార్పులు ఇవే!

Caption of Image.

 జనన, మరణ నమోదు (సవరణ) బిల్లు 2026ను రాజ్యసభ మంగళవారం (ఆగస్టు 4, 2026)  ఆమోదించింది. విపక్ష సభ్యులు ఆందోళనల నడుమ మూజువాణి ఓటుతో బిల్లు పాసైంది. ఇంతకు ముందు జులై 31న లోక్‌సభలో పాస్ అయిన ఈ బిల్లుకు ఇప్పుడు రాజ్యసభలో కూడా ఆమోదం పొందటంతో చట్టరూపం దాల్చనుంది. 

రామమందిరంలో విరాళాల చోరీ, నీట్ పేపర్ లీక్ అంశాలపై విపక్షాలు ఆందోళన చేపట్టాయి.  కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభకు హాజరు కావాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశాయి. దీంతో సభ రెండుసార్లు వాయిదా పడిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ ప్రారంభమైంది.  

బిల్లులో కీలక మార్పులు

జనన, మరణ నమోదు చట్టం 1969లోని నిబంధనలను ప్రస్తుతం చేసిన సవరణ మరింత కఠినతరం చేస్తుంది. ఒక సంవత్సరం వరకు నమోదు విధానంలో మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

జననం లేదా మరణం జరిగిన 21 రోజుల్లోగా సమాచారం ఇస్తే ఎలాంటి ఫీజు లేకుండా సాధారణంగా నమోదు అవుతుంది.
21 రోజుల నుంచి ఒక సంవత్సరం వరకు ఆలస్యమైతే నిర్ణీత ఫీజు చెల్లించి నమోదు చేసుకోవచ్చు.

బిల్లులో కొత్త నిబంధనలు:

జనన, మరణ నమోదు ఒకటి  నుంచి రెండేండ్ల  లోపు ఆలస్యం అయితే జిల్లా మేజిస్ట్రేట్, సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) లేదా వారు నియమించిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అనుమతి అవసరం. వారు సమాచారం, పత్రాలను పూర్తిగా పరిశీలించి మాత్రమే ఆర్డర్ ఇస్తారు.
రెండు సంవత్సరాలకు మించి ఆలస్యం అయితే ఇకపై కేవలం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఫస్ట్ క్లాస్) ఆర్డర్ తర్వాతే నమోదు చేయవచ్చు. అధికారి సమాచారం సరియైనదేనని ధృవీకరించాలి.

 ప్రతి పిల్లవాడి జననం సకాలంలో నమోదు కావడం చాలా ముఖ్యం. దీనిపైనే విద్య, గుర్తింపు, ప్రభుత్వ పథకాలు, చట్టపరమైన హక్కులు ఆధారపడి ఉంటాయి. మరణాల రికార్డు కూడా పరిపాలనా, చట్టపరమైన ప్రక్రియలకు అవసరం. ఫేక్ సర్టిఫికెట్లు నిరోధించడం, గోస్ట్ ఓటర్లు తగ్గించడం, సకాలంలో నమోదు ప్రోత్సహించడం ఈ బిల్లు లక్ష్యం అని ప్రభుత్వం చెబుతోంది.

మరోవైపు ప్రభుత్వం సభ సక్రమంగా నడవడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయోధ్య చోరీ ఆరోపణలు, నీట్ లీకేజీలపై ప్రధాని క్షమాపణ చెప్పాలని కోరాయి.  ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సభకు ఎందుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. సభకు వచ్చి  చర్చ జరపాలని డిమాండ్ చేశారు. 

©️ VIL Media Pvt Ltd.