
Varun Tej Leg Injury: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘కోరియన్ కనకరాజు’ విడుదల కోసం సిద్ధమవుతున్నారు. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ్ తేజ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన చెల్లి నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమాలో వరుణ్ తేజ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ‘కమిటీ కుర్రాళ్లు’ ఫేమ్ యదు వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘బరి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ సినిమా ప్రారంభమైంది. అయితే ఈ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే వరుణ్ తేజ్ కాలు విరిగింది.
ఈ సందర్భంగా ఆయన తన గాయం గురించి మాట్లాడుతూ.. ఆ టైంలో గాయం కారణంగా సాధారణ పనులు చేసుకోవడం కూడా కొంత కష్టంగా మారిందని చెప్పారు. “మొదట్లో చాలా కష్టంగా అనిపించింది. ప్రతి చిన్న పనికి కూడా ఎవరో ఒకరి సహాయం అవసరం అయ్యేది. లైట్ ఆన్ చేయడం, ఫ్యాన్ వేయడం, వాటర్ బాటిల్ తీసుకోవడం లాంటి చిన్న చిన్న పనులు కూడా చేయలేని పరిస్థితి వచ్చింది” అని అన్నారు. అయితే ఈ సమయంలో తన కొడుకుతో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభించిందని చెప్పారు. సాధారణంగా షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్ల దొరకని సమయం ఇప్పుడు తనకు లభించిందని, ఉదయం లేవడం నుంచి రాత్రి పడుకునే వరకు కొడుకుతో గడుపుతున్నానని వెల్లడించారు. తన భార్య లావణ్య త్రిపాఠి కూడా ఇదే విషయాన్ని చెప్పారని వరుణ్ తెలిపారు. ఇంట్లో ఇద్దరు పిల్లలను చూసుకోవడం తనకు కొత్త అనుభూతిని ఇస్తోందని, ప్రస్తుతం పరిస్థితులకు అలవాటు పడుతున్నామని ఆమె చెప్పినట్లు వెల్లడించారు. ఇక ఇంటి పనుల విషయంలో కూడా వరుణ్ తేజ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను సాధారణంగా తన పనులు తానే చేసుకుంటానని, కొంచెం శుభ్రత విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తానని తెలిపారు. వస్తువులను పదే పదే చెక్ చేయడం, ఇంటిని క్లీన్‌గా ఉంచుకోవడం తన అలవాటని అన్నారు. కాలు విరగడం వల్ల షూటింగ్, రోజువారీ పనులకు ఇబ్బందులు ఎదురైనా.. ఆ సమయాన్ని కుటుంబంతో గడిపేందుకు ఉపయోగించుకున్నానని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.