Reading Time: 2 minutes
ఛీ..ఛీ.. ఇదెక్కడి పైశాచికం! స్కూల్‌లో పిల్లాడిపై దారుణం.. టీచర్‌పై పోక్సో కేసు నమోదు

గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌పై బాలికలకే కాదు.. బాలురకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం కనిపిస్తోంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన కామాంధులు వయస్సు, లింగభేదాలను కూడా మరచి లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి ఓ అమానవీయ ఘటన ఒంగోలులో చోటు చేసుకుంది. మూడో తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలుడిపై పీఈటీ టీచర్‌ లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా బాలుడి తల్లిదండ్రులను బెదిరించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కీచక టీచర్‌పై ఫోక్సో కేసు, అట్రాసిటీ కేసు నమోదైంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలులోని రైల్వేస్టేషన్లో రోడ్డులో విఎన్‌జి ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదేళ్ళ బాలుడు మూడో తరగతి చదువుతున్నాడు. అదే స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్న మోరుబోయిన సుబ్బారావు ఎనిమిదేళ్ళ బాలుడిపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. అతడి వికృత చర్యలతో ఆందోళనకు గురైన బాలుడు పాఠశాలకు వెళ్లేందుకు భయపడుతుండటంతో ఏమైందని తల్లిదండ్రులు ఆరా తీయడంతో లైంగిక వేధింపుల వ్యవహారం బయటపడింది. తనపై పిఈటీ టీచర్‌ సుబ్బారావు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు బాలుడు తల్లిదండ్రులకు తెలపడంతో నిర్ఘాంతపోయారు. అనంతరం స్కూలు యాజమాన్యానికి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే స్కూలు యాజమాన్యం టీచర్‌పై చర్యలు తీసుకోవాల్సింది పోయి తిరిగి తమనే బెదిరించారని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. లైంగిక దాడికి పాల్పడిన పీఈటీ సుబ్బారావును కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోకుండా నిందితుడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న స్కూలు యాజమాన్యం గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఫోక్సో, అట్రాసిటీ కేసు నమోదు..

ఈ దారుణ ఘటనపై ఒంగోలు టూటౌన్‌ పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు పిఈటీ టీచర్‌పై పోక్సో కేసు, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. బాధిత విద్యార్ది తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై విచారణ జరిపి తుది నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని ఒంగోలు టూటౌన్‌ సిఐ వీరనాయక్‌ తెలిపారు.

శాఖాపరమైన విచారణ చేపట్టిన అధికారులు..

మరోవైపు విద్యార్ధిపై టీచర్‌ లైంగిక దాడి ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. స్కూలులో పీఈటీగా పనిచేస్తున్న మోరబోయిన సుబ్బారావు బాలుడిని స్కూలుపై అంతస్తులోకి తీసుకెళ్ళి పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్టు వచ్చిన ఫిర్యాదులపై నిందితుడ్ని విచారించారు. ఎవరికైనా చెబితే స్కూలు బిల్డింగ్‌పై నుంచి తోసేస్తానని బాలుడ్ని నిందితుడైన టీచర్‌ బెదిరించినట్టు వచ్చిన ఆరోపణలపై బాధిత బాలుడి నుంచి వివరాలు సేకరించారు. బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, పూర్తి నివేదిక ఆధారంగా నిందితుడిపై చర్యలు తీసుకుంటామని బాలుర సంరక్షణ అధికారులు, విద్యాశాఖ అధికారులు తెలిపారు.