
Food Facts: వేడి వేడి గారె.. కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో తింటే ఆ రుచే వేరు. పండుగైనా, పెళ్లైనా, ఇంట్లో ప్రత్యేక సందర్భమైనా గారె తప్పనిసరిగా ఉండే వంటకం. కానీ మనం చిన్నప్పటి నుంచి చూస్తూ, తింటూ వస్తున్న గారె మధ్యలో ఉండే ఆ చిల్లు గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అది కేవలం అందంగా కనిపించడానికి పెట్టిందే అనుకుంటే పొరపాటే. గారె రుచి, మెత్తదనం, సరిగ్గా ఉడికే విధానం, వంట చేసే సౌలభ్యం… ఇలా ఎన్నో కారణాలు ఆ చిన్న చిల్లు వెనక దాగి ఉన్నాయని మీకు తెలుసా.. ఈ స్పెషల్ స్టోరీలో ఆ చిల్లు ముచ్చట ఏందో తెలుసుకుందాం.
ఇదే అసలు ట్రిక్
మినప్పిండితో చేసే గారె కొంచెం మందంగా ఉంటుంది. అందుకే మధ్యలో చిల్లు పెడితే వేడి నూనె అన్ని వైపులా సమానంగా తగులుతుంది. దీంతో బయట మాత్రమే కాదు, లోపలి భాగం కూడా పూర్తిగా ఉడుకుతుంది. చిల్లు లేకుండా చేస్తే బయట కరకరలాడినా, లోపల మాత్రం పిండి ఉడకకుండా ఉండే అవకాశం ఉంటుంది. గారె ప్రత్యేకత బయట కరకరగా, లోపల మెత్తగా ఉండటమే. మధ్యలో చిల్లు ఉండటం వల్ల వేడి సమంగా ప్రసరించి గారె గట్టిపడకుండా ఉంటుంది. అందుకే హోటళ్లలో చేసే గారెలు కూడా ఈ పద్ధతిలోనే తయారవుతాయి. వేడి నూనెలో వేస్తే గారె ఎక్కువగా ఉబ్బిపోకుండా ఉండటానికి కూడా ఈ చిల్లు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. దీంతో గారె గుండ్రంగా, మంచి ఆకారంలో వస్తుంది. రుచి కూడా మరింత బాగుంటుంది.
పూర్వం గరిటెలు, ప్రత్యేకమైన కిచెన్ టూల్స్ లేని రోజుల్లో గారె మధ్యలో ఉన్న చిల్లును ఉపయోగించి సులభంగా నూనెలో నుంచి తీసేవారని పెద్దలు చెబుతున్నారు. దీంతో వేడి నూనె చిమ్మే ప్రమాదం కూడా తగ్గేదని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటికీ చాలామంది ఇదే పద్ధతిని పాటిస్తున్నారట. వంట నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గారె మధ్యలో చిల్లు పెట్టడం వల్ల దాని ఉపరితల వైశాల్యం పెరిగి వేడి సమానంగా చేరుతుంది. దీంతో గారె బయట కరకరగా, లోపల మెత్తగా తయారవుతుంది. అందుకే తరతరాలుగా ఈ పద్ధతి కొనసాగుతోందని అంటున్నారు. ఒక్క చిన్న చిల్లు వెనక వంటింటి అనుభవం, శాస్త్రీయ కారణం, సంప్రదాయం ఎన్నీ ఉన్నాయో తెలుసుకున్నారా. ఇకపై గారె తినేటప్పుడు ఆ చిల్లును చూస్తే, దాని వెనక ఉన్న ఈ ఆసక్తికరమైన కారణం కూడా గుర్తుకొస్తుంది.