
గుజరాత్‌లో చండీపుర వైరస్ ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. దింతో చండీపుర వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి గుజరాత్ రాష్ట్ర ఆరోగ్య శాఖను పూర్తిగా అప్రమత్తం చేశారు. వివిధ జిల్లాల్లో 15 ఏళ్ల లోపు పిల్లల్లో ఇప్పటివరకు 184 అనుమానిత కేసులు నమోదు కాగా, అందులో 35 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారించారు. మరో 11 మంది పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని ఆరోగ్య శాఖ మంత్రి ప్రఫుల్ పన్షేరియా స్పష్టం చేశారు. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం గాంధీనగర్, రాజ్‌కోట్, పటాన్ తదితర ఆసుపత్రులలో 7 మంది చికిత్స పొందుతుండగా, 6 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
నివారణ చర్యలు – వైద్యుల సూచనలు:
పిల్లలపై ప్రత్యేక నిఘా: వివిధ ప్రాంతాల్లో కేసులు వెలుగుచూస్తుండటంతో అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
జాగ్రత్తలు: ఈ వైరస్ దోమలు లేదా ఈగల ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి, ఇళ్లలోని మట్టి గోడల పగుళ్లను మూసివేయాలని ఆరోగ్య శాఖ సూచించింది. పశువులు ఉండే ప్రదేశాల చుట్టూ పురుగుమందులు పిచికారీ చేస్తున్నారు.
ఆసుపత్రులలో ఏర్పాట్లు: పిల్లల్లో తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసీయూ, ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ సదుపాయం ఉండేలా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను అప్రమత్తం చేశారు.
ప్రజలకు హెచ్చరికలు – వైరస్ లక్షణాలు:
చండీపుర వైరస్‌కు ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యేకమైన మందుగానీ, వ్యాక్సిన్ గానీ అందుబాటులో లేదు. దింతో టీకాలు, చికిత్సలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక వైద్య పరిశోధకుల బృందాలు కృషి చేస్తున్నాయి.
గమనించాల్సిన లక్షణాలు: పిల్లల్లో తీవ్రమైన జ్వరం, వాంతులు, లేదా మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు.
చేయవలసింది: వెంటనే సమీపంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలి. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, వదంతులను పట్టించుకోవద్దని.. పుకార్లు నమ్మి ఆందోళన చెందకుండా, ఇంటికి వచ్చే ఆరోగ్య శాఖ సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని ఆరోగ్య శాఖ మంత్రి కోరారు.