Reading Time: 1 minute
Brett Lee Breaks Silence Preity Zinta Dating Rumors After 15 Years

Dating Rumors: ఆస్ట్రేలియా మాజీ స్టార్ పేసర్ బ్రెట్ లీ, బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో తనకు ప్రేమ వ్యవహారం ఉందంటూ ఎన్నో ఏళ్లుగా వస్తున్న ప్రచారాలపై 15 ఏళ్ల తర్వాత స్పందించారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్లకు ఆయన పూర్తిగా చెక్ పెడుతూ.. తమ మధ్య ఉన్నది కేవలం మంచి స్నేహం మాత్రమేనని స్పష్టం చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభ సీజన్లలో బ్రెట్ లీ కింగ్స్ XI పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింటాతో ఆయన తరచూ కనిపించడంతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కూడా ఈ ప్రచారం చాలాకాలం కొనసాగింది.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో బ్రెట్ లీ ఈ వార్తలను ఖండించారు. “నేను ఏ బాలీవుడ్ నటితోనూ డేటింగ్ చేయలేదు. ప్రజలు తమకు నచ్చినట్లు ఊహాగానాలు చేసుకుంటారు. కానీ అలాంటి వార్తలను నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. నాకు నిజం తెలుసు కాబట్టి అవి నాపై ఎలాంటి ప్రభావం చూపలేదు” అని ఆయన చెప్పారు. ప్రీతి జింటాపై బ్రెట్ లీ ప్రశంసలు కూడా కురిపించారు. కింగ్స్ XI పంజాబ్‌లో కలిసి పనిచేసిన రోజుల్లో తమ మధ్య మంచి స్నేహం ఏర్పడిందని, భారతదేశంలో తనకు అత్యంత సన్నిహిత స్నేహితుల్లో ప్రీతి ఒకరని తెలిపారు. ఆమె ఎంతో తెలివైన వ్యక్తి అని, ఆమెపై తనకు అపారమైన గౌరవం ఉందని వెల్లడించారు. గతంలో 2011లో కూడా బ్రెట్ లీ ఇదే విషయంపై స్పందిస్తూ తమ మధ్య ఉన్నది కేవలం స్నేహమేనని స్పష్టం చేశారు. ఇక ప్రీతి జింటా కూడా అప్పట్లో ఈ రూమర్లను ఖండించారు. 2010లో సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆమె “నేను ఏ క్రికెటర్‌తోనూ డేటింగ్ చేయడం లేదు. ఎవరితోనైనా రిలేషన్‌లో ఉంటే ఆ విషయాన్ని నేనే చెబుతాను” అంటూ స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ప్రీతి జింటా తన భర్త జీన్ గూడెనఫ్‌తో కలిసి ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. 2016లో వీరిద్దరూ వివాహం చేసుకోగా, 2021లో సరోగసీ ద్వారా కవలలకు తల్లిదండ్రులయ్యారు. మరోవైపు బ్రెట్ లీ 2015లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కామెంటేటర్‌గా, క్రికెట్ విశ్లేషకుడిగా కొనసాగుతున్నారు.