Reading Time: < 1 minute
Cloudburst: జమ్ముకశ్మీర్‌లో వరుణుడి బీభత్సం.. మెరుపు వరదల్లో 31 మంది మృతి

జమ్ముకశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం సృష్టిస్తోంది. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ఏకంగా 35 క్లౌడ్‌బరస్ట్‌ సంఘటనలు చోటుచేసుకున్నాయి. క్లౌడ్‌బరస్ట్‌ కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు , కొండచరియలు విరిగిపడ్డ ఘటనల్లో సుమారు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయి. చల్లదనానికి పేరుగాంచిన జమ్ముకశ్మీర్‌పై వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, తరచూ చోటుచేసుకుంటున్న క్లౌడ్ బరస్ట్ ఘటనలు, మెరుపు వరదలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

అత్యధికంగా నష్టపోయిన ప్రాంతాలు:

* జమ్ము డివిజన్: పూంచ్, రాజౌరి, కఠువా, దోడా, కిష్త్వార్ జిల్లాల్లో భారీ ప్రాణనష్టం సంభవించింది

* కశ్మీర్ లోయ: షోపియాన్, అనంతనాగ్, బందిపొర, కుప్వారా ప్రాంతాల్లో వరద తాకిడి తీవ్రంగా ఉంది. సోమవారం కురిసిన భారీ వర్షాలకు కుప్వారా, షోపియాన్ తదితర ప్రాంతాల్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

నివాస గృహాలు, దుకాణాలు, పాఠశాలలు, వంతెనలు, రోడ్లు, సాగునీటి కాలువలు కొట్టుకుపోయాయి. వందలాది ఎకరాల వ్యవసాయ భూములు నీట మునిగాయి. సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

వాతావరణ శాఖ హెచ్చరికలు

ఆగస్టు 4, 5 తేదీల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పర్వత ప్రాంతాల్లో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహించే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నదుల పరీవాహక ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు కోరారు. సోమవారం బందిపొర ప్రాంతంలో జరిగిన క్లౌడ్ బరస్ట్ వల్ల ప్రాణనష్టం తప్పినప్పటికీ, భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. పలు ఇళ్లు, పొలాలు, పశువుల కొట్టాలు నీటిపాలయ్యాయి.

నిపుణులు ఏమంటున్నారు?

కొండ ప్రాంతాల్లో కురిసే భారీ వర్షాల వల్ల నీరు ప్రవహించే మార్గాలు కుచించుకుపోయి. ఒక్కసారిగా ఉప్పొంగడం వల్ల ఫ్లాష్ ఫ్లడ్స్ (ఆకస్మిక వరదలు) ముప్పు పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. అరేబియా సముద్రం నుంచి వస్తున్న గాలులు, రుతుపవనాలు, వెస్ట్రన్ డిస్టర్బెన్స్ (పశ్చిమ గాలులు) అన్నీ ఒకేసారి కలవడం వల్ల కశ్మీర్‌లోని హిమాలయాలు, పీర్‌పంజా ప్రాంతాల్లో ఈ ప్రమాదకర వాతావరణ పరిస్థితులు తలెత్తుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కశ్మీర్‌కు ఇది అత్యంత కఠినమైన సమయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.