ఆధునిక యుద్ధ రంగంలో డ్రోన్ల ముప్పు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. భారత సైన్యం తన రక్షణ వలయాన్ని మరింత పటిష్టం చేసుకుంది. యుద్ధ రంగంలో శత్రు దేశాల డ్రోన్ల దాడులను తిప్పకొట్టేందుకు భారత్ మరో శక్తివంతమైన ఆయుధాన్ని సిద్ధం చేసింది. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో తయారైన ‘శత్రుంజయ్’ (Shatrunjay) యాంటీ-డ్రోన్ వ్యవస్థను సైనిక దళాల అమ్ములపొదిలో చేర్చింది.
ఢిల్లీకి చెందిన ప్రముఖ డిఫెన్స్ కంపెనీ ‘భూమి ఇంటెక్ ఎక్విప్మెంట్స్’ (Bhumi Entech) అభివృద్ధి చేసిన ఈ ‘కౌంటర్-డ్రోన్ సిస్టమ్’ (C-UAS) ఆకాశం నుంచి ముంచెత్తే ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
‘శత్రుంజయ్’ యాంటీ-డ్రోన్ ప్రత్యేకతలు: ఖచ్చితమైన గుర్తింపు: రేడియో ఫ్రీక్వెన్సీ (RF) డిటెక్షన్ టెక్నాలజీ సాయంతో.. దాదాపు 4 కిలోమీటర్ల పరిధిలో సంచరించే శత్రు డ్రోన్లను ఇది ఇట్టే పసిగట్టగలదు. జామింగ్ & స్పూఫింగ్: శత్రువుల డ్రోన్ కంట్రోల్ సిగ్నల్స్‌ను జామ్ చేయడంతో పాటు, జీపీఎస్ స్పూఫింగ్ (GPS Spoofing) టెక్నాలజీ ద్వారా వాటి నావిగేషన్‌ను తప్పుదారి పట్టించి నిర్వీర్యం చేయగలదు.
పోర్టబుల్ డిజైన్: దీనిని అత్యంత పటిష్టంగా, మాడ్యులర్ డిజైన్‌లో రూపొందించారు. దీన్ని అవసరాన్ని బట్టి సైనిక వాహనాలపై (Military Vehicles) అమర్చుకోవచ్చు లేదా సైనికులు నేరుగా మోహరింపు ప్రాంతాలకు మోసుకెళ్లవచ్చు (Man-portable). ఆత్మనిర్భర్ భారత్: పూర్తిగా దేశీయంగానే డిజైన్ చేసి తయారు చేయడం ద్వారా.. రక్షణ రంగంలో భారత్ మరోసారి తన స్వయం శక్తి, స్వావలంబనను నిరూపించుకుంది.
ఎక్కడెక్కడ మోహరింపు?..భారత సరిహద్దు ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మకమైన సైనిక స్థావరాలు, వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన కీలక ప్రాంతాల రక్షణ కోసం ఈ అధునాతన వ్యవస్థను రంగంలోకి దించుతున్నారు. అధికారికంగా సంఖ్యపై స్పష్టత లేనప్పటికీ, సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేసేందుకు ఇదొక చారిత్రాత్మక అడుగుగా రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.




