
ఏలూరు: సోషల్ మీడియాలో పరిచయం కావడంతో ప్రేమగా మారింది. ఇద్దరు పిల్లల తల్లిని ఓ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. గోడవలు జరుగుతుండడంతో ఇద్దరు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో నాచుగుంట గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. యర్రమళ్ల గ్రామానికి చెందిన మావుళ్లయ్య(25) ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడంతో పాటు చేపల ప్యాకింగ్ చేస్తూ తల్లిదండ్రులు సత్యనారాయణ, వీరమ్మలతో కలిసి ఉంటున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇర్రి రమతో(35) ఇన్‌స్టాగ్రామ్‌లో మావుళ్లయ్యకు పరిచయమైంది. పరిచయం ప్రేమగా మారడంతో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇద్దరు కలిసి వివాహం చేసుకున్నారు. ఈ విషయం భర్తకు తెలియడంతో యర్రమళ్లకు వచ్చి మావుళ్లయ్య కుటుంబ సభ్యులతో అతడు గొడవకు దిగాడు.అనంతరం భార్య రమను తీసుకొని భర్త తన సొంతూరు సింగుపురానికి వెళ్లిపోయాడు. మావుళ్లయ్య తన అన్న కుమారుడు సతీష్‌కు ఫోన్ చేసి ఇద్దరం ఉంగుటూరులో ఉన్నామని, నాచుగుంటకు రమ్మని కబురు పంపాడు. అన్న కుమారుడు అక్కడికి చేరుకొనేసరికి కాలువ గట్టున మావుళ్లయ్య వస్తువు కనిపించడంతో కాలువలో దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటారని కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని రమ, మావుళ్లయ్య మృతదేహాలను బయటకు తీశారు. దీంతో రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోయారు.